
- ఇల్లు, భూములు తనఖా పెట్టి మరీ ఇచ్చిన బాధితులు
- మొదట్లో సక్రమంగా చెల్లించినా తర్వాత పట్టించుకోని నిందితుడు
- వందల కోట్లు తీసుకొని ముఖం చాటేసిన బాలాజీనాయక్
- ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురు బాధితుల్లో ఇద్దరు మృతి
- నిందితుడికి లీడర్ల అండ ఉందంటూ ప్రచారం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటున్న రమావత్ సరియా అనే వ్యక్తి ఓ ఏజెంట్ సాయంతో పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్‌కు రూ.16 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తర్వాత బాలాజీనాయక్ కనిపించకపోవడం, ఏజెంట్‌కు కాల్ చేసినా అతడు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన సరియా మూడు రోజుల కింద గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పలుగుతండాకు చెందిన రమావత్ లోక్యతో పాటు అతడి కుమారులు బాలాజీనాయక్‌కు రూ. 30 లక్షలకు పైగా అప్పు ఇచ్చారు. కొంతకాలం పాటు బాగానే వడ్డీ ఇచ్చిన బాలాజీనాయక్ తర్వాత వాయిదాలు పెడుతూ వచ్చాడు. దీంతో డబ్బులు తిరిగి వస్తాయో లేదోనని ఆందోళనకు గురైన లోక్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నల్గొండ, వెలుగు : అధిక వడ్డీ ఇస్తాడని నమ్మి ఓ వ్యక్తికి కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తే.. చివరకు అతడు మోసం చేసి పరార్ కావడంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఇల్లు, భూములు తనఖా పెట్టి, బయట అప్పులు తెచ్చి మరీ అతడికి ఇచ్చిన పైసలు తిరిగి రావేమోనన్న ఆందోళనతో ప్రాణాలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో ఓ యువకుడు చేసిన మోసానికి ఇప్పటికే ఇద్దరు బలికాగా.. మరో వ్యక్తి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
20 శాతం వడ్డీ అంటూ మోసాలు
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామ పరిధిలోని పలుగు తండాకు చెందిన రమావత్ బాలాజీ నాయక్ అనే యువకుడు ఐదేండ్ల కింద 10 నుంచి 20 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మించి బంధువుల వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కొన్నేళ్ల పాటు వడ్డీ డబ్బులు సక్రమంగానే ఇచ్చి నమ్మకం కలిగించాడు. ఈ వడ్డీ వ్యాపారం కాస్తా బయటకు పొక్కడంతో తండావాసులు తమ ఇండ్లు, భూములు తనఖా పెట్టడంతో పాటు బయటి నుంచి అప్పులు తెచ్చి మరీ బాలాజీనాయక్‌కు ఇవ్వడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో కొండమల్లేపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆఫీసులు ఓపెన్ చేసి, తన వ్యాపారం బాగా నడుస్తుందని నమ్మించాడు. మరో వైపు మండలంలోని పలు గ్రామాల్లో పేదలకు ఆర్థిక సాయం చేస్తూ, ఆలయాలకు విరాళాలు ఇస్తూ అందరి దృష్టిలో పడేవాడు. వడ్డీ వ్యాపారం మరింత పెరగడంతో ఏజెంట్లను నియమించుకొని మరీ అప్పులు సేకరించడం ప్రారంభించాడు. ఎక్కువ డబ్బులు ఇప్పించిన ఏజెంట్లకు కార్లు, విల్లాలు బహుమతులుగా ఇవ్వడంతో.. సదరు ఏజెంట్లు ఉమ్మడి పీఏ పల్లి మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులను సైతం కలిసి వారి వద్ద డబ్బులు తీసుకొని బాలాజీనాయక్‌కు ఇచ్చేవారు.
ఎవరికైనా అనుమానం వచ్చి ఇంత వడ్డీ ఎలా ఇస్తున్నావని అడిగితే.. డబ్బులను రియల్ ఎస్టేట్ సంస్థలు, స్టాక్ మార్కెట్, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాల నుంచి వడ్డీలు ఇస్తున్నానంటూ సమాధానం చెప్పేవాడు. ఇలా సుమారు వంద మంది ఏజెంట్లను నియమించుకొని వంద కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బాలాజీనాయక్ తీసుకున్న మొత్తం రూ. 500 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
గతేడాది నుంచి వడ్డీ చెల్లింపు నిలిపివేత
మొదట్లో సక్రమంగానే వడ్డీలు చెల్లించిన బాలాజీనాయక్ గతేడాది నుంచి వడ్డీ చెల్లింపులు నిలిపివేయగా.. అడిగిన వారికి వాయిదాలు పెడుతూ వచ్చాడు. వడ్డీ డబ్బులే కాకుండా అసలు కూడా ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు నాలుగు నెలల కింద నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయంపై ఎంక్వైరీ చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు సూచించారు. దీంతో పోలీసులు బాలాజీనాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.
బాధితుల నుంచి తీసుకున్న డబ్బులను మూడు నెలల్లోగా చెల్లించాలని పెద్ద మనుషుల సమక్షంలో పేపర్ రాయించి అతడిని వదిలేశారు. కానీ మూడు నెలలు దాటినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నెల రోజుల నుంచి పలుగు తండాలోని బాలాజీనాయక్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అయినా స్పందన లేకపోవడంతో ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు బుధవారం బాలాజీనాయక్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు.
బాలాజీనాయక్ వెనుక ప్రజాప్రతినిధులు
బాలాజీ నాయక్‌కు రాజకీయ నాయకులు, అధికారులు అండదండలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వీరి అండతోనే ఇంతకాలం ఖరీదైన కార్లలో తిరుగుతూ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. బాలాజీనాయక్ వ్యవహారం తెలుసుకున్న స్థానిక నాయకుడొకరు ఏకంగా రేంజ్ రోవర్ కార్‌ను గిఫ్ట్‌గా అడుగగా.. ఫార్చునర్ కారు లేదంటే రూ. 30 లక్షలు ఇస్తానని బాలాజీనాయక్ చెప్పినట్లు తెలుస్తోంది.
అలాగే మరో ప్రజాప్రతినిధికి సైతం కోట్లలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు నాలుగు నెలల క్రితం విచారణ పేరుతో బాలాజీనాయక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత వదిలేయడం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇద్దరు బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడంతో పోలీసులు బాలాజీనాయక్‌ను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.