స్టాగ్ పార్టీ’కి వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్

స్టాగ్ పార్టీ’కి వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్
  • ఢిల్లీలో 34 ఏండ్ల వ్యక్తికి సోకినట్లు గుర్తింపు
  • ఇటీవల అతడు ‘స్టాగ్ పార్టీ’కి వెళ్లాడన్న ఆఫీసర్లు
  • లోక్‌‌ నాయక్ హాస్పిటల్‌‌లో ఐసోలేషన్‌‌లో ఉంచి చికిత్స
  • కాంటాక్ట్ అయిన వారు క్వారంటైన్‌‌కు
  • దేశంలో 4కి చేరిన కేసుల సంఖ్య
  • ఆందోళన అవసరం లేదన్న నిపుణులు


న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఎలాంటి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. ఓ వ్యక్తి (34)కి ఈ వైరస్ సోకిందని ఆఫీసర్లు వెల్లడించారు. ఇటీవల హిమాచల్‌‌ప్రదేశ్‌‌లోని మనాలిలో జరిగిన ఓ స్టాగ్ పార్టీ (మగవాళ్లు మాత్రమే హాజరవుతారు)కి ఇతడు వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. వెస్ట్ ఢిల్లీకి చెందిన ఇతడికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో.. మూడు రోజుల కిందట మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌‌లో అడ్మిట్ చేశారు. శాంపిల్స్‌‌ను పుణెలోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌‌ఐవీ)కి పంపారు. శనివారం పాజిటివ్ వచ్చిందని ఆఫీసర్లు చెప్పారు. ప్రస్తుతం లోక్‌‌ నాయక్ హాస్పిటల్‌‌లో ఐసోలేషన్ సెంటర్‌‌‌‌లో ఉంచి ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నామని, కోలుకుంటున్నాడని తెలిపారు. కాంటా క్ట్ అయిన వారిని గుర్తించి క్వారంటైన్‌‌లో ఉంచారు. తాజా కేసుతో కలిపి దేశంలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. మిగతా ముగ్గురు కేరళకు చెందిన వాళ్లు. 

కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌‌పై చర్చించేందుకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌‌ఎస్) ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌‌లో హెల్త్ మినిస్ట్రీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌‌సీడీసీ), ఐసీఎంఆర్‌‌‌‌ తదితర సంస్థల ఆఫీసర్లు పాల్గొన్నారు.

భయపడాల్సిన పనిలేదు: నిపుణులు
మంకీపాక్స్‌‌ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. ‘‘మంకీపాక్స్ కొత్తదేం కాదు. ఐదు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. దాని వైరల్ స్ట్రక్చర్, ట్రాన్స్‌‌మిషన్ వంటి విషయాలపై ఇప్పటికే అవగాహన ఉంది. కఠిన నిఘా ద్వారా మంకీపాక్స్‌‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. వైరస్ బారిన వారిని ఐసోలేషన్‌‌లో ఉంచడం, కాంటాక్ట్‌‌లను క్వారంటైన్ చేయడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని ఎపిడెమియాలజిస్ట్, అంటువ్యాధుల డాక్టర్ చంద్రకాంత్ లహారియా చెప్పారు. ఈ వైరస్ సోకితే చాలా వరకు స్వల్ప అనారోగ్యం ఉంటుందని తెలిపారు. ‘రింగ్ వ్యాక్సినేషన్’ కింద మశూచి వ్యాక్సిన్లను వేయవచ్చని, అయితే సాధారణ ప్రజలకు టీకాలు వేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సిఫార్సులు చేయలేదని వివరించారు. 

మంకీపాక్స్.. గ్లోబల్ ఎమర్జెన్సీ
మంకీపాక్స్‌‌ను గ్లోబల్‌‌ హెల్త్‌‌ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్‌‌ హెల్త్‌‌ ఎమర్జెన్సీ ఆఫ్‌‌ ఇంటర్నేషనల్‌‌ కన్సర్న్‌‌ (పీహెచ్‌‌ఈఐసీ)’గా పేర్కొంది. పీహెచ్‌‌ఈఐసీ.. పాండెమిక్‌‌కు కాస్త తక్కువ. 2020 జనవరిలో కరోనాను కూడా పీహెచ్‌‌ఈఐసీ గానే డబ్ల్యూహెచ్‌‌వో ప్రకటించింది. మంకీపాక్స్‌‌ను తాత్కాలికంగా పీహెచ్‌‌ఈఐసీ కేట గిరీలో చేర్చారు. 3నెలలకోసారి రివ్యూ చేస్తారు. ఇప్పటిదాకా 75 దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదవ్వగా ఐదుగురు చనిపోయారు.