కోతులు రాకుండా.. కాపలా టీమ్‌‌లు

కోతులు రాకుండా.. కాపలా టీమ్‌‌లు
  • రోజంతా గస్తీ తిరుగుతున్న యువకులు, రైతులు
  • నిర్మల్​ పరిసర ప్రాంతాల్లో కోతుల బీభత్సం 
  • ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణుకు 
  • కోతుల దాడులతో రోజుకు ఐదారుగురు ఆస్పత్రి పాలు
  • పక్కనే కోతుల పునరావాస కేంద్రం ఉన్నా నిర్లక్ష్యమే..
  • స్టైరిలైజేషన్​ పట్టించుకోని అధికారులు, లీడర్లు

నిర్మల్, వెలుగు : నిర్మల్, బైంసా, ఖానాపూర్ పట్టణాలతో పాటు చాలా గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా  ఇళ్లల్లో చొరబడి హంగామా చేస్తున్నాయి.  ఒక ఇంటి నుంచి మరో ఇంటికి తిరుగుతూ జనాల మీద  దాడులు చేస్తున్నాయి. ఎవరైనా వాటిని అదిలించినా, తరిమివేసేందుకు ప్రయత్నించినా గుంపులుగా వచ్చి  మీద పడుతున్నాయి. దీంతో జనాలు గ్రామంలో తిరగాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి కోతులొచ్చి మీద పడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరినన్నా తోడు తీసుకుని.. కర్రలు పట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కోతుల దాడుల్లో చాలా మంది గాయాలపాలవుతున్నారు. కోతుల దాడిలో గాయపడిన వారు రోజూ ఐదారుగురి కన్నా ఎక్కువ మంది నిర్మల్​ ప్రభుత్వాసుపత్రికి ట్రీట్​మెంట్​ కోసం వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. 

వంతుల వారీగా గస్తీ

పొద్దంతా ఊళ్లమీద పడి హంగామా చేస్తున్న కోతులు రాత్రి పూట పొలాల మీద పడుతున్నాయి. అనేక గ్రామాల్లో పంట చేన్లను నాశనం చేస్తుండడంతో రైతులకు కంటి మీద కునుకు ఉండడంలేదు. కోతుల బెడద గురించి మున్సిపల్ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మరక్షణ కోసం జనాలే ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో యువకులు, రైతులు టీమ్‌‌లుగా ఏర్పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు  వంతుల వారీగా గస్తీ కాస్తున్నారు. ఊళ్లమీద, పొలాల మీద పడుతున్న కోతుల గుంపులను తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణ చందా మండలంలోని పీచర, రాచాపూర్, వడ్యాల్‌‌, నిర్మల్ మండలంలోని చిట్యాల, సోన్, మామడ మండలాల్లో కాపలా బృందాలు ఏర్పడ్డాయి. వారెంత ప్రయాస పడుతున్నా పూర్తిగా ఊరట లభించడం లేదు. సాయంత్రం కాగానే కోతులు మళ్లీ ఊళ్లలోకి చొరబడుతున్నాయి. పంట చేన్లను నాశనం చేస్తున్నాయి.  

మూడున్నరేళ్లలో కేవలం 1,456 స్టెరిలైజేషన్లు 

కోతుల బెడదపై మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోతులను మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు పట్టుకొని నిర్మల్ లోని కోతుల పునరావాస కేంద్రానికి తరలించాలి. అయితే ఈ వ్యవహారం ఖర్చుతో కూడుకోవడం, కోతులు పట్టేవారు అందుబాటులో లేకపోతుండడం, కోతులు పట్టుకునేందుకు బడ్జెట్ లేకపోవడం వల్ల స్థానిక సంస్థలు చేతులెత్తేశాయి. కొన్ని గ్రామపంచాయతీలు మాత్రం జనరల్​ ఫండ్స్​ నుంచి డబ్బులు ఖర్చుచేసి కోతులను పట్టుకొని నిర్మల్ పునరావాస కేంద్రానికి తరలిస్తున్నాయి.  నిర్మల్ పక్కనే ఉన్న చించోలి బీగండి రామన్న హరితవనంలో రూ. కోటి వెచ్చించి.. 2020 లో మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్ (కోతుల పునరావాస కేంద్రం) ఏర్పాటు చేశారు. 

ఇక్కడ ఇప్పటివరకు కేవలం 1,456 కోతులకు మాత్రమే జనన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేశారు. రాష్ట్రంలోని అన్ని చోట్లనుంచి కోతులను పట్టుకొని ఈ కేంద్రానికి తరలించాలి. ఇక్కడ స్టెరిలైజేషన్​ చేసిన తర్వాత వారం రోజుల పాటు పునరావాసం కల్పించి ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ప్రాంతానికి పంపుతారు. ప్రతిరోజు దాదాపు 20 కోతులకు స్టెరిలైజేషన్ చేసే సౌకర్యం ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు ఇక్కడ కనీసం 10వేల కోతులకు స్టెరిలైజేషన్ చేయాల్సిఉండగా 1,456 ఆపరేషన్లు మాత్రమే జరిగాయి. ఇటీవల సిద్దిపేట, నర్సాపూర్​నుంచి 500 కోతులను తరలించారు. కానీ.. సమస్య  తీవ్రంగా ఉన్న నిర్మల్​ జిల్లా నుంచి మాత్రం  కోతులను పట్టుకుని  తరలించకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు.