జూన్ 4 న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

జూన్ 4 న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

ఎండలతో అల్లాడుతున్న జనానికి గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. జూన్ 4 కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకటనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి కొంత వరకు వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రానున్న మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణశాఖ.

ఈసారి నైరుతి రుతుపవవాలు కాస్త ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది స్కైమెట్ వాతావరణ సంస్థ. మామూలుగా జూన్ ఒకటికల్లా  కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు…. ఈసారి జూన్ 4న తీరాన్ని చేరతాయని తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. దక్షిణ భారతంలో 95శాతం, మధ్య భారతంలో 91శాతంగా వర్షపాతం ఉంటుందని పేర్కొంది. తక్కువ వర్షపాతం కారణంగా వల్ల వ్యవసాయ ఉత్పత్తి, వృద్ధి రేటు అవకాశాలు తగ్గుతాయని తెలిపింది.

విదర్భ,  మరాఠ్వాడ, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో సాధారణం కంటే తక్కువ వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కరువు పరిస్థితులు ఏర్పాడవచ్చని చెబుతోంది. కర్నాటక, రాయలసీమల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కేరళ, కర్నాటక  వర్షాలు బాగా కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ.

మరోవైపు ఎండలు దంచి కొడుతూనే ఉన్నాయి. రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణశాఖ. కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 18 వరకు వడగాల్పులు వీస్తాయంది. ఆదిలాబాద్, కరీంనగర్ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. పిల్లలు, వృద్ధులను పగటి పూట బయటకు రానివ్వొద్దని చెబుతున్నారు.