ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 31న క్యాబినెట్ భేటీ

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల  31న క్యాబినెట్ భేటీ

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల  31న క్యాబినెట్ భేటీ 
నిర్ణయించిన సర్కారు 
వర్షాలు, వరదలు, సాగు ప్రత్యామ్నాయంపై క్యాబినెట్ లో చర్చ 

హైదరాబాద్ :  ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయన్నది బీఏసీలో చర్చించి నిర్ణయించనున్నారు. కాగా, జులై 31 తేదీ  మధ్యాహ్నాం 2 గంటల కు రాష్ట్ర క్యాబినెట్  సమావేశం జరగనుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  సచివాలయంలో  క్యాబినెట్​భేటీ అవనుంది. ఈసారి క్యాబినెట్ లో సమారు  40 నుంచి 50 అంశాల మీద చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన  భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినేట్ సమీక్షించనున్నది. 

రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినేట్ చర్చించనున్నది. వర్షాలకు  వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై చర్చించనున్నారు.