
- ఇండ్లలోనే పత్తి నిల్వలు
- సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కొన్నది 2 లక్షల క్వింటాళ్లే..
- 5 లక్షల క్వింటాళ్లకు పైగా పేరకుపోయిన నిల్వలు
- దాచుకోలేక రైతులకు ముప్పుతిప్పలు
- మంచి ధర కోసం నెలల కొద్దీ ఎదురుచూపులు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలో ఈసారి 1.43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 15 లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. చీడ పీడలు, అధిక వర్షాల కారణంగా ఆశించిన దానిలో సగం మాత్రమే దిగుబడి వచ్చింది. దానికి కూడా సరైన ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.30 లక్షల క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేయగా, దాదాపు 5 లక్షల క్వింటాళ్లకు పైగా రైతులు ఇండ్లల్లోనే నిల్వ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతేడాదిలో ఇదే సమయానికి జరిగిన అమ్మకాలకు ఇప్పుడు అందులో 45 శాతం అమ్మకాలు కూడా జరగలేదు. వాస్తవానికి ఫిబ్రవరిలోపు 90 శాతం అమ్మకాలు జరగాల్సి వున్నా ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
ఆందోళనలో రైతులు
పత్తి ధర మొదట అనూహ్యంగా పెరిగి తరువాత క్రమంగా తగ్గుతుండటం పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. డిసెంబరు నెలారంభంలో గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.9320 రికార్డు ధర దక్కింది. దీంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన రైతులు పత్తిని అమ్మకుండా ఉన్నారు. కానీ వారి ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.7200 మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో స్థల ప్రభావం కారణంగా పత్తిని ఎక్కువ రోజులు దాచలేక ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరకు అమ్మితే భారీగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ కష్టమైనా ధర పెరుగుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా పత్తి ధరలు పడిపోవడంపై కొంత మేర అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలో నూలు, వస్త్రాల ధరలు పడిపోవడం కొంత కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈయన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరెపల్లికి చెందిన రైతు రమేశ్. ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టాడు. పత్తిని మార్కెట్‌కు తీసుకువెళ్లే సమయానికి రేటు పడిపోయింది. దీంతో కొన్ని రోజులు ఆగితే మంచి ధర వస్తుందేమోనని 45 క్వింటళ్ల పత్తిని ఇంట్లోనే నిల్వ చేశాడు. కానీ నెలలు గడుస్తున్నా ధర క్వింటాల్‌కు రూ.7 వేలు మాత్రమే ఉండటంతో నిరశ చెందుతున్నాడు. రమేశ్మాత్రమే కాదు.. జిల్లాలోని చాలా మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.