నష్టాలను భర్తీ చేసేందుకు కంపెనీలకు గ్రాంట్‌‌

నష్టాలను భర్తీ చేసేందుకు కంపెనీలకు గ్రాంట్‌‌

న్యూఢిల్లీ:  పెట్రోల్‌‌, డీజిల్ అమ్మకాలపై వచ్చిన నష్టాల వలన  దేశంలోని ఆయిల్‌‌ మార్కెటింగ్ కంపెనీల రెవెన్యూ  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోతుందని మూడీస్ ఇన్వెస్టర్స్‌‌ సర్వీసెస్‌‌  పేర్కొంది. లిక్విఫైడ్‌‌ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌‌పీజీ) సేల్స్ వలన వచ్చిన నష్టాలను కొంత భర్తీ చేయడానికి  రూ. 22 వేల కోట్ల గ్రాంట్‌‌ను ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ), భారత్‌‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌‌), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌‌పీసీఎల్‌‌) లు జూన్, 2020 నుంచి జూన్, 2022 మధ్య ఎల్‌‌పీజీని సేల్ చేయడం వలన వచ్చిన నష్టాలను కొంత భర్తీ చేయడానికి  ఈ గ్రాంట్ ఇచ్చారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ కంపెనీల రిజల్ట్స్ బలహీనంగానే ఉంటాయని మూడీస్ అంచనా వేసింది.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పెట్రోల్‌‌, డీజిల్ సేల్స్‌‌పై వచ్చిన నష్టాలు ఇంకా రికవరీ కాలేదని తెలిపింది. ‘ రేట్లు పెంచకుండా  నవంబర్‌‌‌‌ 2021–  ఆగస్టు, 2022 మధ్య  పెట్రోల్‌‌, డీజిల్‌‌ను సేల్ చేయడం వలన ప్రభుత్వ రిఫైనరీ కంపెనీలకు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5–7 బిలియన్ డాలర్ల (రూ. 57,400 కోట్ల)  రెవెన్యూ లాస్ వచ్చిందని అంచనా వేస్తున్నాం. దీనికి సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్ అందలేదు’ అని మూడీస్‌‌ వెల్లడించింది. ఐఓసీకి పెట్రోల్‌‌, డీజిల్‌‌ అమ్మకాలపై 3–3.2 బిలియన్ డాలర్ల (రూ.24,600 కోట్ల)  రెవెన్యూ లాస్‌‌ వచ్చిందని, బీపీసీఎల్‌‌, హెచ్‌‌పీసీఎల్‌‌లకు 1.6–1.9 బిలియన్ డాలర్ల (రూ. 15 వేల కోట్ల) లాస్‌‌ వచ్చిందని వివరించింది. కరోనా తర్వాత  డిమాండ్ రికవరీ అవ్వడంతో పాటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వలన ఈ ఏడాది జనవరి– ఆగస్టు మధ్య ఇండియా కొన్నక్రూడాయిల్ ధరలు సగటున బ్యారెల్‌‌కు 104 డాలర్లకు చేరుకున్నాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌లో ఇది బ్యారెల్‌‌కు 80 డాలర్లుగా ఉంది. గ్లోబల్ మార్కెట్‌‌లో క్రూడ్‌‌ ధరలు  విపరీతంగా పెరిగినా అంతే స్థాయిలో లోకల్‌‌గా పెట్రోల్‌‌, డీజిల్ రేట్లను కంపెనీలు పెంచలేదని మూడీస్ వెల్లడించింది.