సోమరులకు పని విలువ తెలియజేసిన రాజు

సోమరులకు పని విలువ తెలియజేసిన రాజు

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దమ్మ ఉండేది. వయసు మీద పడటంతో పనులకు పోలేక పూటకూళ్ళ ఇల్లు పెట్టుకుంది. ఆ ఊరి మీదుగా పోయే వ్యాపారులు అందరూ ఆమె ఇంట్లోనే తిని అవ్వకు తగినంత డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్లు. కొందరు జాలిపడి.. ‘‘మాతోపాటు మా ఊరికి వచ్చి మా ఇంట్లో ఉంటూ... మాకు చేసి పెట్టు. నీకు ఏ కష్టం రాకుండా మేం చూసుకుంటాం’’ అనే వారు. ‘నాకు ఓపిక ఉన్నంతవరకు ఎవరిపైనా ఆధారపడి బతకను’ అంటూ కరాఖండిగా చెప్పేది పెద్దమ్మ. ఓ రోజు రాజ్యంలోని ప్రజల స్థితిగతులను గమనించడానికి మహారాజు మారు వేషంలో ఊళ్లోకి వచ్చాడు.

సాయంత్రం వరకు అన్నీ పరిశీలిస్తూ రాత్రి పొద్దుపోయేసరికి బస చేయడం కోసం పెద్దమ్మ ఇల్లు చేరాడు.అవ్వను చూసిన రాజు ‘‘ఈ వయసులో నువ్వు ఇంత కష్ట పడటం ఎందుకు? మీ రాజు వృద్ధుల కోసం ఆశ్రమాలు కట్టించారు. అందులో ఉండి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా”అన్నాడు. అందుకు పెద్దమ్మ నవ్వుతూ ‘అలా అందరికీ పెట్టబట్టే రాజ్యం ఇలా ఉంది’ అంది తన పని తాను చేసుకుంటూ. పెద్దమ్మ మాటలకు ఏదో అర్థం ఉందని గ్రహించిన రాజు భోజనం పూర్తవగానే ‘నేను నిన్ను అడిగిన ప్రశ్నకు, నువ్వు చెప్పిన సమాధానానికి అర్థం ఏంటి?’ అని అడిగాడు రాజు.

‘అయ్యా మీరెవరో నాకు తెలియదు. నాకు వయసు మీదపడినప్పటికీ శరీరంలో పని చేయగల సత్తా ఉంది. అలా పనిచేయగల వారిని ఊరికే కూర్చోబెట్టి పోషించడం అంటే రాజ్యసంపద వృథా చేయడమే కదా. అంతేకాదు యువత వారికి నచ్చిన పని దొరికే వరకు ఖాళీగా ఉంటూ, ఏ పని చేయడంలేదు. అలాంటి వారిని ప్రోత్సహిస్తే రాజ్యంలో అందరూ సోమరులు అవుతారు’ అంది పెద్దమ్మ.

ఉదయం లేవగానే పెద్దమ్మకు చెప్పి రాజధానికి బయలుదేరిన రాజు అత్యవసరంగా సభను ఏర్పాటు చేసి, తాను చెప్పినట్టుగా రాజ్యంలో చాటింపు వేయించమన్నాడు. ‘‘రాజ్యంలోని అందరికీ తెలియజేయడమేమనగా... ఈ రోజు ఎవరైతే పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారో వారికి రాజు తన ఆస్థానంలో మంచి బహుమతి ఇస్తారు. అందరూ తప్పక హాజరు కావలెనహో ...” అంటూ దండోరా వేసి వెళ్ళిపోయాడు.

పనిచేయని వాళ్ళు అందరూ రాజు ఇచ్చే బహుమానం కోసం సభకు పరుగులు తీశారు. సభ ప్రారంభం కాగానే వచ్చిన వాళ్లని లోపల ఉంచి బయట తలుపులు గడియ పెట్టమన్నాడు రాజు. అందరూ భద్రత కోసం అనుకున్నారు. వచ్చిన వారందరినీ చూసిన రాజు ‘వీళ్లందరినీ చెరసాలలో వేసి బంధించండి’ అన్నాడు.
అక్కడున్న వారికి రాజు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అందరూ రాజు హాస్యం కోసం చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ, అక్కడున్న భటులు మాత్రం రాజాజ్ఞను పాటిస్తూ అందరికీ సంకెళ్ళు వేశారు. అందరూ అక్కడ ఏం జరుగుతోందో తెలియక తికమకపడుతున్నారు.

అక్కడున్న వారిలో ఒక యువకుడు మాత్రం ‘‘ఇది అన్యాయం మమ్మల్ని ఇక్కడికి రమ్మని బంధిస్తారా? మేం ఏ తప్పు చేశాం’’ అంటూ అడగబోతాడు. అందుకు రాజు కోపంగా ‘మిమ్మల్ని చెరసాలలో వేస్తాను అంటే కోపం వస్తోంది. మీలాంటి వాళ్లు బయట ఉండి మాత్రం ఏం ప్రయోజనం? మీవల్ల అటు మీ కుటుంబానికి, ఇటు రాజ్యానికి ఏమీ లాభం లేదు. మిమ్మల్ని ఊరికే ఇంట్లో కూర్చోబెట్టి పోషించే బదులు.... ఇక్కడ ఉన్న చీకటి గదిలో వేస్తే బయట పనిచేసుకునే వారికి విలువ ఉంటుంది’’ అన్నాడు. అక్కడున్న అందరూ ఆలోచించుకున్నారు. రాజుని క్షమాపణ అడిగారు. ‘మేం ఇకపై సోమరులుగా ఉండం. మాకు పని విలువ తెలిసింది. ఇక మీదట పనిచేసుకుంటాం’ అని చెప్పారు. పెద్దమ్మ చెప్పిన మాటలు నెరవేరబోతున్నందుకు రాజు సంతోషించాడు. - శేష సాయికుమార్