Moral Story: మారిన నక్క.. అడవిలో పులి .. తోడేలు, ఎలుగుబంటి ఏం చేశాయంటే..!

Moral Story: మారిన నక్క.. అడవిలో పులి ..  తోడేలు, ఎలుగుబంటి ఏం చేశాయంటే..!

సుందరవనం అనే అడవిలో పెద్దపులి ఒకసారి జంతువులకు విందు ఏర్పాటు చేసింది.  ఆ విందుకు అది మృగరాజు సింహంతో పాటు జంతువులన్నింటినీ పిలిచింది. నక్క కూడా ఆ విందుకు వెళదామని తన నేస్తమైన తోడేలుతో పాటు బయలుదేరింది.

నక్కకు ఎన్నాళ్ళ నుంచో విందు భోజనం, ద్రాక్షపండ్లు తినాలని ఆశ. ఆ సమీపంలోకి వెళ్ళగానే ఘుమఘుమలాడే ఆహార పదార్థాల వాసన దాని ముక్కుపుటాలకు సోకింది. అంతేకాకుండా తనకు ఇష్టమైన ద్రాక్షపండ్లు కూడా ఉంటాయని కోతి చెప్పడంతో తన కోరిక తీరుతున్నందుకు ఎంతగానో సంతోషించింది. ఇంతలో కళ్లు తిరిగినట్లై క్రింద పడిపోయింది. వెంటనే తోడేలు గమనించి మరికొన్ని జంతువుల సాయంతో దానిని వైద్యం చేస్తున్న ఎలుగుబంటి వద్దకు తీసుకొని వెళ్ళింది. 

ఎలుగుబంటి దానికి వైద్యం చేసి ఆ నక్కతో ‘‘ఓ నక్కా!’’ నీవు ఇతరుల పట్ల అసూయ మాను. అప్పుడు నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. నువ్వు ఎప్పుడూ ఇతరులకు చెడు చేయాలని చూస్తావు. అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది. ఈరోజు విందు భోజనంతో పాటు నీకు ఇష్టమైన ద్రాక్షపండ్లు తినడం కూడా మానుకో!’’అని చెప్పింది.  ఆ మాట విని ఆ నక్క నిరాశ చెందింది. ఎలుగుబంటితో సరేనని చెప్పి విందు భోజనం చేయకుండానే, తన కోరిక తీరకుండానే ఇంటికి మరలింది.

మరొక్కసారి చిరుత పులి జంతువులకు విందును ఏర్పాటు చేసింది.  తోడేలుకు కూడా విందు భోజనం అంటే చాలా ఇష్టం.  అది తనకు తోడుగా నక్కను తీసుకొని చిరుత పులి ఇస్తున్న విందుకు బయలుదేరింది.  అక్కడ వంటకాల వాసనల ఘుమఘుమలు చూసి తోడేలు కూడా ఎంతో సంతోషించింది. కానీ అది కూడా తల తిరిగి క్రింద పడిపోయింది. అప్పుడు నక్క కొన్ని జంతువుల సహకారంతో ఎలుగుబంటి వద్దకు దానిని తీసుకొని వెళ్లింది.  నక్క దానిని చూసి తనలాగే ఎలుగుబంటి దానికి కూడా భోజనంతో పాటు దానికి ఇష్టమైన ఆహారం వద్దని చెబుతుందని భావించింది. 

కానీ ఎలుగుబంటి దానితో ‘‘ఓ తోడేలా! నువ్వు ఇంత నీరసంగా ఉంటే ఎలా! బాగా తిను. నీరసం వల్లనే నీకు ఇలా జరిగింది. ఈరోజు చిరుతపులి విందులో నువ్వు నీకు ఇష్టమైన వన్నీ తిను!’’ అని అంది. అది విని నక్క ఆశ్చర్య పోయి ‘‘అయ్యో! నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. అయినా నేను ఇకనుండి ఇతరుల పైన అసూయ, ద్వేషం పెట్టుకోను. అప్పుడు నా ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా రోజులుగా నిద్ర చక్కగా లేని నాకు మంచి నిద్ర కూడా పడుతుంది.  అప్పుడు ఈ తోడేలు వలెనే ఎలుగుబంటి నాకు అన్నీ తినమని చెప్తుంది’’ అని ఆనాటినుండి అది ఇతర జంతువులకు సాయం చేయడం ప్రారంభించింది. అప్పటినుండి దాని ఆరోగ్యం కుదుటపడింది.-

–సంగనభట్ల చిన్న రామకిష్టయ్య–