భూమిస్తే చాలు.. ఖర్చు తామే భరిస్తాం

భూమిస్తే చాలు.. ఖర్చు తామే భరిస్తాం

హైదరాబాద్, వెలుగు: వాతావరణంలో రోజురోజుకూ చోటుచేసుకుంటున్న మార్పులపై కచ్చిత సమాచారం అందుకోవాలంటే.. మరిన్ని అబ్జర్వేటరీలు అవసరం అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10 అబ్జర్వేటరీలున్నాయి. భవిష్యత్తులో జిల్లాకొకటి ఏర్పాటు చేయాలని వాతావరణ కేంద్రం భావిస్తున్నది. గత కొన్నేండ్లను పరిశీలిస్తే.. వాతావరణంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. 2019 వరకు లోటు వర్షపాతం నమోదై.. అన్ని చోట్ల కరువు తాండవించింది. అదే 2020 నుంచి కుండపోత వానలు పడుతున్నాయి. గత మూడేండ్లుగా ప్లస్ వర్షపాతాలు నమోదవడం, ఈ యేడు జులైలో 3 వారాల పాటు వానలు పడి చాలాసార్లు రెడ్ అలర్ట్ లు జారీచేయడం చూస్తేనే వాతావరణ మార్పులు గమనించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పక్కా సమాచారం ఇవ్వాలంటే చాలా కష్టంగా మారింది. అందుకే క్లియర్ వెదర్ ఇన్ఫర్మేషన్ కోసం అబ్జర్వేటరీలు కావాలని అధికారులు కోరుతున్నారు.

1891లో తొలి అబ్జర్వేటరీ

తెలంగాణలో 1891లో అబ్జర్వేటరీలు పురుడు పోసుకున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అబ్జర్వేటరీలు ఏర్పాటయ్యాయి. నవంబర్​ 10న హైదరాబాద్​లో, నవంబర్​12న నిజామాబాద్​లో మొదలయ్యాయి. అంతకు ముందు పుణెలోని వాతావరణ కేంద్రం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేసేవారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 అబ్జర్వేటరీలున్నాయి. వీటికితోడు మరో 56 రెయిన్ గేజ్ స్టేషన్లున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత 1898లో హనుమకొండ, 1940లో ఖమ్మం, 1946లో రామగుండం, 1952లో భద్రాచలం, మహబూబ్ నగర్, 1977లో నల్గొండ, 1979లో మెదక్, 1980లో ఆదిలాబాద్ లో అబ్జర్వేటరీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ గతంలో ఉన్న పాత జిల్లాలను పరిగణలోకి తీసుకుని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా  జిల్లాకో అబ్జర్వేటరీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వాతావరణ కేంద్రం ఉన్నతాధికారుల్లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదట్నుంచీ ఎక్కువ అబ్జర్వేటరీలను ప్రస్తుత ఏపీలోని పలు జిల్లాల్లో ప్రారంభించారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదన్న భావన అధికారుల్లో కనిపిస్తున్నది. అబ్జర్వేటరీలనే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లుగా పరిగణిస్తారు. గాలుల తీవ్రతతోపాటు గంట గంటకూ టెంపరేచర్ ను అంచనా వేసేందుకు ఈ స్టేషన్లు పనిచేస్తుంటాయి. రెయిన్ గేజ్ సెంటర్స్ మాత్రం వర్షపాతాన్ని నమోదు చేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల పాత్రే వాతావరణ సమాచారంలో కీలకమని ఆ విభాగం అంటున్నది.

ఒక్కో సెంటర్ కు రూ.7 లక్షల ఖర్చు

కొత్తగా అబ్జర్వేటరీ ఏర్పాటు చేయాలంటే.. రూ.6 నుంచి 7 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు. అన్ని జిల్లాల్లో వాతావరణ ఉప కేంద్రాలు ఏర్పాటైతే రూ.1.50 కోట్లు అవసరం అవుతాయని భావిస్తున్నారు. ఆ నిధులిచ్చేందుకు వాతావరణ శాఖ సిద్ధంగా ఉంది. కొత్త జిల్లాల వారీగా అబ్జర్వేటరీల నిర్మాణం కోసం ముందు ల్యాండ్ గుర్తించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ల్యాండ్ సేకరణ అంశం పెండింగ్ లో ఉండటం, వాతావరణ మార్పులు వేగంగా జరిగిపోతుండటంతో అబ్జర్వేటరీలను తొందరగా ప్రారంభించుకుంటే మంచిదన్న అభిప్రాయం నెలకొన్నది. ల్యాండ్ సేకరణకు సర్కారు సహకరిస్తే నిర్మాణాల ఖర్చు తామే భరిస్తామని, ప్రభుత్వంపై భారం వేయబోమని ఆ విభాగం అధికారులంటున్నారు.