1000మందికి పైగా గాయాలు, 100మంది పరిస్థితి క్రిటికల్.. ఒడిశాకు చేరుకున్న కేంద్ర ఆరోగ్యమంత్రి

1000మందికి పైగా గాయాలు, 100మంది పరిస్థితి క్రిటికల్.. ఒడిశాకు చేరుకున్న కేంద్ర ఆరోగ్యమంత్రి

బాలాసోర్ విషాద రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని  కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. అంతకుముందుకు ఒడిశాకు చేరుకున్న ఆయన... రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచిన భువనేశ్వర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. “ఢిల్లీ AIIMS, ఇతర ఆసుపత్రుల నుంచి నిపుణులైన వైద్యుల బృందం భారత వైమానిక దళం (IAF) ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంది. వారు అత్యాధునిక పరికరాలు, మందులతో చికిత్స చేయనున్నారు ”అని మాండవ్య తెలియజేశారు.

రోగుల పరిస్థితి, వారు చేరిన ఆసుపత్రులు, వారికి ఎలాంటి చికిత్స అవసరం, నిపుణుల బృందం వారికి ఎలా సహాయం చేయగలదో సమగ్ర సమీక్ష జరిపామని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. అధునాతన చికిత్స అందించడం కోసం వర్కింగ్ ప్లాన్ అమలవుతోందన్న ఆయన.. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందికి సహాయం చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌తో సహా వివిధ ఆసుపత్రుల నుంచి నిపుణుల నిపుణుల బృందం ఒడిశాకు చేరుకుంది.