ఎన్నికల వేళ .. చెక్కుల్లో కదలిక

ఎన్నికల వేళ .. చెక్కుల్లో కదలిక
  • రెండ్రోజుల్లోనే 50 చెక్కుల క్లియరెన్స్​
  • సెక్రటేరియట్​లో నెలల తరబడి 300కు పైగా చెక్కులు పెండింగ్​
  • ఇప్పుడు కదులుతున్న ఎస్​డీఎఫ్​, సీడీఎఫ్​ బిల్లులు
  •  కానీ కటింగ్, చెల్లింపులకే సరిపోతున్నాయంటున్న సర్పంచులు, కాంట్రాక్టర్లు

యాదాద్రి, వెలుగు: ఎన్నికల సీజన్​​ వచ్చేసింది. పెండింగ్​ చెక్కులు  కదులుతున్నాయి. ఆయా పనులకు సంబంధించిన బిల్లులను రిలీజ్​ చేసేందుకు సర్కార్ చకచకా చర్యలు తీసుకుంటోంది. రెండ్రోజుల్లోనే యాదాద్రి జిల్లాకు చెందిన 50 చెక్కులకు క్లియరెన్స్​  వచ్చింది.  పంచాయతీలు, మున్సిపాలిటీల్లో  అభివృద్ధి పనులకు స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్​ (ఎస్​డీఎఫ్​) మంజూరుమంజూరు చేస్తున్నట్టు దత్తత గ్రామమైన వాసాలమ్రిలో సీఎం కేసీఆర్ రెండేండ్ల కింద ప్రకటించారు. యాదాద్రి జిల్లాలో రూ. 108.50 కోట్లతో 2430 వర్క్స్ కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 28 కోట్ల విలువగల 370 పనులను ప్రారంభించారు. 

వీటిలో ఎక్కువ వర్క్స్​ కంప్లీట్​ అయ్యాయి.  నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్​) కింద  ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రూ. 3 కోట్ల డెవలప్​మెంట్ వర్క్స్​ చేపట్టవచ్చు. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతమ నియోజకవర్గాల్లో కొన్ని వర్క్స్​ కేటాయించారు. వర్క్​ పూర్తి చేసి  బిల్లుల కోసం సర్పంచులు, కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారు.  ఎసీడీఎఫ్​, సీడీఎఫ్​ వర్క్స్​కు సంబంధించి రూ. 20 కోట్ల విలువైన 300కు పైగా చెక్కులను ఈ కుబేర్​లో ఎంట్రీ చేయించారు. అయితే సెక్రటేరియట్​కు వెళ్లిన చెక్కులు ఎనిమిది నెలలుగా బిల్లులు  పెండింగ్​లో ఉన్నాయి. 

ఎన్నికల ఏడాది.. కదలిక షురూ.. 

ఈ ఏడాది డిసెంబర్​లో ఎన్నికలు జరుగనున్నండటంతో పెండింగ్​ చెక్కుల్లో కదలికలు కనబడుతున్నాయి. జిల్లాలో  కొద్దిమంది తప్ప అందరూ బీఆర్​ఎస్​ సర్పంచ్​లే ఉన్నారు.  ఈ ఎన్నికల్లో వారే కీలకంగా మారనున్నారు. కానీ చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు  తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 2022–‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-23 ఫైనాన్షియల్​ ఇయర్​ ముగిసినా బిల్లులు రాకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. ఈ దెబ్బ ఎన్నికల్లో పడుతుందేమోనని బీఆర్​ఎస్​లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వారిని బుజ్జగించడానికే నెలల తరబడి పెండింగ్​లో ఉన్న బిల్లులను ఇప్పుడు విడుదల చేస్తున్నారు.   గత డిసెంబర్​ వరకు పూర్తయిన పనులకు సంబంధించిన చెక్కుల క్లియరెన్స్​ ప్రక్రియ మొదలైంది. కేవలం రెండు రోజుల్లో దాదాపు 50 చెక్కులకు క్లియరెన్స్​ వచ్చేసింది. 

కమీషన్లు.. కటింగ్​కే సరి

నెలల తరబడి పెండింగ్​లో ఉన్న బిల్లులు రిలీజ్​ అయినా తీసుకున్న కాంట్రాక్టర్లు సంతోషంగా లేరు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ట్రెజరీ డిపార్ట్​మెంట్​ సహా ఇతర డిపార్ట్​మెంట్లు అన్నీ కలిపి 10శాతం వరకు ముందే కమీషన్లు ఇచ్చారు. ఇవి కాకుండా వర్క్స్​ కోసం పోటీ పడిన వారికి ముడుపులు అప్పజెప్పారు. ఈ చెల్లింపులతో పాటు జీఎస్టీ కలుపుకుంటే 30 శాతం కోత పడుతోంది. రూ. 5 లక్షల వర్క్​కు రూ. లక్షకు పైగా ఖర్చు అయిందని అంటున్నారు. పనులు చేసి నెలల తరబడి ఆగినప్పటికీ బిల్లులు సగమే వచ్చాయని తెలిపారు. వర్క్స్​ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని కాంట్రాక్టర్లు, సర్పంచ్​లు చెబుతున్నారు.