కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో.. 60.30లక్షల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(డబ్ల్యూఎఫ్పీ) సంస్థలు ప్రకటించాయి. క్రాప్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అసెస్మెంట్ మిషన్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులను తెలుసుకునేందుకు -2022, జూన్– జులై మధ్య 25 జిల్లాల్లో ఆర్గనైజేషన్స్ సభ్యులు పర్యటించారు. ప్రజలకు అత్యవసర సాయం అందట్లేదని, జీవనోపాధికి సపోర్ట్ ఇవ్వకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఎఫ్ఏఓ, డబ్ల్యూఎఫ్పీ సంస్థలు హెచ్చరించాయి. పోయిన రెండు సీజన్లలో వ్యవసాయ ఉత్పత్తులు 50% తగ్గాయని తెలిపాయి.
విదేశీ మారకం పరిమితుల కారణంగా దిగుమతులు పడిపోయాయని ప్రకటించాయి. ఆహార భద్రత పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని తెలిపాయి. 30% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నదని, సాగు రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని అభిప్రాయపడ్డాయి. 60శాతానికి పైగా ప్రజలు తక్కువ ధరకు లభించే ఫుడ్ తీసుకుంటున్నారని, తినడం కూడా తగ్గించారని తెలిపాయి. ప్రభుత్వం వెంటనే న్యూట్రిషన్ ఫుడ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని, బడుల్లో స్టూడెంట్స్కు భోజనం పెట్టాలన్నాయి. 2022లో 3 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని, 2017 తర్వాత ఇదే అతి తక్కువ అని చెప్పాయి. మొక్కజొన్న ప్రొడక్షన్.. పోయిన ఐదేండ్ల సగటు కంటే 40% తక్కువగా నమోదైందని తెలిపాయి. మాతా శిశు మరణాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూఎఫ్పీ ప్రతినిధి, శ్రీలంక డైరెక్టర్ అబ్దుర్ రహీం సిద్ధిఖీ సూచించారు.
