గ్రీవెన్స్ చుట్టూ బాధితులు.. ధరణిలో తప్పులపై అత్యధిక ఫిర్యాదులు

గ్రీవెన్స్ చుట్టూ బాధితులు.. ధరణిలో తప్పులపై అత్యధిక ఫిర్యాదులు
  • దళితబంధు, ‘డబుల్’ ఇండ్లు, పింఛన్ల కోసం భారీగా అర్జీలు
  • ప్రతి సోమవారం కలెక్టరేట్లకు పెద్దసంఖ్యలో జనం
  • ఫిర్యాదులు, దరఖాస్తులను పక్కనపడేస్తున్న ఆఫీసర్లు
  • ఎన్ని సార్లు తిరిగినా సమస్యలు పరిష్కారమైతలే
  • ఆవేదనతో ఆత్మహత్యకు యత్నిస్తున్న బాధితులు

నెట్‌‌వర్క్, వెలుగు: ధరణిలో తమ సర్వే నంబర్లు కనిపిస్తలేవని.. పాస్‌‌బుక్‌‌లో భూమి తక్కువగా పడిందని.. తమ భూమిని అక్రమంగా వేరే వాళ్లకు పట్టా చేశారని.. అన్ని అర్హతలు ఉన్నా తమకు దళిత బంధు వస్తలేదని.. నిలువ నీడలేకున్నా డబుల్ ​బెడ్​రూం ఇండ్లు ఇస్తలేరని.. కాళ్లు, చేతులు కోల్పోయినా దివ్యాంగుల పింఛన్​ మంజూరు చేస్తలేరని.. ఇలా ఎన్నో సమస్యలతో బాధితులు ప్రతి సోమవారం అర్జీలు పట్టుకొని కలెక్టరేట్లకు క్యూ కడ్తున్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్లను, ఇతర ఆఫీసర్లను వేడుకుంటున్నారు. కానీ ధరణి కారణంగా భూ సమస్యల పరిష్కారం కలెక్టర్ల చేతుల్లో లేకుండా పోయింది. బాధితులకు జరిగిన అన్యాయం కండ్ల ముందు కనిపిస్తున్నా కరెక్షన్ చేయలేని పరిస్థితి వాళ్లది. అటు దళితబంధు, డబుల్ బెడ్​రూం ఇండ్లు తదితర స్కీములకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే సర్కారు గంపగుత్తగా అప్పగించింది. దీంతో కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు ప్రతివారం గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ఏమీ చేయలేక పక్కనపడేస్తున్నారు. అసలు విషయం తెలియని బాధితులు పదే పదే దరఖాస్తులు పట్టుకొని కలెక్టరేట్ల​చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నెలలు, ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో చివరికి ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు.

పరిష్కారానికి నోచని భూసమస్యలు

భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలు నేటికీ పరిష్కారం కావడం లేదు. ధరణిలో సర్వే నంబర్లు మిస్​కావడం, భూవిస్తీర్ణంలో తేడాలు, భూమి ఉన్నా పాస్​బుక్స్​రాకపోవడం, మ్యుటేషన్ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూములకు పాత యజమానుల పేరిటే పాస్ బుక్స్ జారీ చేయడం, పట్టా భూములను, మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడం లాంటి అనేక సమస్యలతో జనం ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్నారు. కానీ ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా, బాధితుల పక్షాన న్యాయం ఉందని తెలిసినా కలెక్టర్లు ఏమీ చేయలేకపోతున్నారు. నిజానికి భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఒక్కో మండలానికి వంద టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పంపి, ఎమ్మెల్యేల నేతృత్వంలో సదస్సులు నిర్వహిస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. జులై పోయి డిసెంబర్ వచ్చినా రెవెన్యూ సదస్సులు జరగలేదు. దీంతో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్దసంఖ్యలో భూబాధితులు క్యూ కడ్తున్నారు.

స్కీములపై ఎమ్మెల్యేలదే పెత్తనం

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్​ఫండ్ లాంటి వాటికి లబ్ధిదారులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తున్నారు. ఆసరా పింఛన్లు సైతం లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒకే చెప్పిన వాళ్లకే ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు వెరిఫై చేసి పంపిన లిస్టులను సైతం ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు. గ్రామాల్లో తమ​పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, లీడర్లతో మాట్లాడి మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో అర్హులకు బదులు అనర్హులకు స్కీములు దక్కుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దిక్కుతోచని పేదలు, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కడ్తున్నారు. ఆయా స్కీములకు తాము అన్ని విధాలా అర్హులమని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కానీ కలెక్టర్లు తమ చేతిలో ఏమీ లేదని చెప్పలేక.. అర్జీలు తీసుకొని ‘చూస్తాం.. చేస్తాం..’ అంటూ దాటవేస్తున్నారు. ఇటీవల తమకు దళితబంధు ఇప్పించాలంటూ కొందరు వరంగల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేడుకోగా, ఎమ్మెల్యే సిఫార్సు లెటర్​ తేవాలని ఆయన సూచించారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా.. ఎమ్మెల్యేల సిఫార్సుతో సంబంధం లేకుండా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. కానీ దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి  క్లారిటీ ఇవ్వకపోవడంతో కలెక్టర్లు ఏమీ చేయలేని పరిస్థితి. కలెక్టరేట్ల చుట్టూ అర్జీలు పట్టుకొని నెలల తరబడి తిరుగుతున్న బాధితులు విసిగివేసారి ధర్నాలకు దిగుతున్నారు. కొందరైతే గ్రీవెన్స్​లో ఆఫీసర్ల ఎదుటే పెట్రోల్ పోసుకొని, పురుగుమందుల తాగి ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు.

తన భూమి ధరణిలో కనిపిస్తలేదని..

తన భూమిని ధరణి నుంచి మాయం చేశారని, ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓ మహిళా రైతు బ్లేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమె చేతిలోంచి బ్లేడు గుంజుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కావాడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 67 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జయశ్రీ అనే రైతుకు 1.35 ఎకరాల భూమి ఉంది. దీన్ని తమకు అమ్మాలని జనచైతన్య, శ్రీజ వెంచర్ యజమానులు ఒత్తిడి చేశారని, తాను అమ్మకపోవడంతో అధికారులతో కలిసి భూమిని కాజేశారని జయశ్రీ ఆరోపించింది. ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని అడిషనల్ కలెక్టర్​తిరుపతిరావు హామీ ఇచ్చారు.

పింఛన్ కోసం దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి చెందిన యాదగిరి దివ్యాంగుడు. ఇతడికి ఇద్దరు కొడుకులు కాగా.. వాళ్లు వేరేగా ఉంటున్నారు. యాదగిరి మూడున్నరేండ్ల కిందట పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యాదాద్రి జిల్లాలో 24,976 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఒక నెల పింఛన్ ఇచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 770 మంది పేర్లను తొలగించారు. తొలగించిన వాటిలో యాదగిరి పేరు కూడా ఉంది. దీని గురించి ఆఫీసర్లను కలిసి యాదగిరి అడిగాడు. ‘నీ కొడుక్కి ట్రాక్టర్ ఉంది. అందుకే పింఛన్ లిస్ట్ నుంచి నీ పేరు తొలగించారు’ అని ఆఫీసర్లు చెప్పారు. తన పింఛన్ పునరుద్ధరించాలని ఆఫీసర్లను ఎన్నిసార్లు కలిసినా ఫలితం కనిపించలేదు. దీంతో యాదగిరి సీసాలో పెట్రోల్ తీసుకొని యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చాడు. అందరి ఎదుటే తనపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన అక్కడి స్టాఫ్, పోలీసులు యాదగిరి నుంచి పెట్రోల్ సీసా లాక్కొని బయటకు విసిరేశారు. అతి కష్టం మీద అతడిని కలెక్టరేట్ బయటకు తీసుకొచ్చి, ఇంటికి పంపారు. ఇదంతా ప్రజావాణి హాలులోనే జరుగుతున్నా.. కలెక్టర్ పమేలా సత్పతి మాత్రం ఫిర్యాదులు స్వీకరించడంలో మునిగిపోవడం గమనార్హం.

రెండు చేతులు లేక.. సాయం అందక

రెండు చేతులు లేని ఇతని పేరు గైని రామకృష్ణ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మన్సూర్ పురకు చెందిన ఇతను.. సెంట్రింగ్ పని చేస్తుండగా కరెంట్ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురై రెండు చేతులు కోల్పోయాడు. భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేందుకు ఉపాధి చూపాలంటూ ఎనిమిదేండ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు. దళిత బంధు కింద కిరాణా షాప్ కేటాయించాలని కోరుతున్నాడు. ఏడాది కింద నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలవగా.. దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆ హామీ నెరవేరలేదు.

ఇన్నిసార్లు తిప్పించుకుంటరా?

ఈయన పేరు మామిండ్ల రాజయ్య. కామారెడ్డి శివారులోని సర్వే నంబర్ 531లో 24 గుంటల భూమి ఈయనకు ఉంది. తాతల కాలం నుంచి ఉన్న పట్టా భూమి. కొత్త పాస్ బుక్ ఇచ్చినప్పుడు 2 గుంటలు మాత్రమే ఎంట్రీ చేశారు. అడిగితే ప్రింట్ తప్పు పడిందని చెప్పారు. పాస్ బుక్ సరి చేయాలని ప్రజావాణిలో ఇదివరకు 8 సార్లు ఫిర్యాదు చేశాడు. సోమవారం మళ్లీ దరఖాస్తు ఇచ్చాడు. ప్రతిసారీ మారుస్తమని చెప్తున్నారే కానీ పని మాత్రం కావడం లేదు. సమస్యలు తీర్చేందుకే ప్రజావాణి అంటున్నారని, మరి ఇన్ని సార్లు తిప్పించుకోవడం ఎందుకని రాజయ్య ప్రశ్నిస్తున్నాడు.

నాలుగేండ్ల నుంచి తిరుగుతున్న

మా ఊల్లో 526 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాకు వంశపారంపర్యంగా వస్తున్న 1.36 ఎకరాల భూమి ఉంది. దివ్యాంగుడినైన నాకు ఆ భూమే ఆధారం. మాకు తెలియకుండానే మా భూమిలో 1.10 ఎకరాలను వీఆర్ఏ తన భార్య పేరు మీద పట్టా చేసుకున్నాడు. 2018లోనే ఈ విషయం మీద తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసినం. మా భూమి తిరిగి ఇస్తానని ఆఫీసర్ల ముందు వీఆర్ఏ ఒప్పుకున్నడు. కానీ ఇప్పటిదాకా భూమి అప్పగించలేదు. తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల్లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. నాలుగేండ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా.. ధరణి సమస్య అని, కోర్టులో తేల్చుకోవాలని, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సలహాలు ఇస్తున్నారే కానీ సమస్యను పరిష్కరించడంలేదు. - సదమల్ల సారయ్య, ల్యాదెళ్ల, దామెర మండలం, హనుమకొండ జిల్లా

పది సార్లు దరఖాస్తు ఇచ్చిన

మాకు వారసత్వంగా వస్తున్న ఎకరం ఒక గుంట భూమి ఉంది. ఆ భూమిని కొన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి.. మా కుటుంబ సభ్యుడొకరి పేరు మీద అధికారులు పట్టా చేశారు. ఇదేంటని అడిగితే.. ‘కోర్టుకు వెళ్లి తేల్చుకోండి’ అంటూ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కరీంనగర్ ప్రజావాణిలో ఇప్పటికి పది సార్లు దరఖాస్తు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. - గునుకొండ సుధాకర్, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా

అర్హతున్నా పింఛన్ ఆపేసిన్రు

ఆగస్టులో నాకు ఆసరా ఫించన్ కార్డు ఇచ్చిన్రు. కానీ డబ్బులు మాత్రం వేయడం లేదు. 85 శాతం దివ్యాంగుడిగా సర్టిఫికెట్ ఉంది. తెల్లరేషన్ కార్డు కూడా ఉంది. అయినా పింఛన్ ఇస్తలేరు. డీఆర్డీవో ఆఫీసుకు వెళ్తే పైకి పంపించామని చెబుతున్నారు. రెండు నెలల నుంచి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. - సంజీవ్ రెడ్డి, బట్టి సవర్గాం