ఫోన్లు, కార్లు, ఇండ్లు.. అప్పులతోనే కొనుడు

ఫోన్లు, కార్లు, ఇండ్లు.. అప్పులతోనే కొనుడు

బిజినెస్ డెస్క్​, వెలుగు: మనదేశంలో చాలా మందికి అప్పు లేనిదే తెల్లారడం లేదు.  అరువు తీసుకోవడానికి కొంచెం కూడా వెనుకాడటం లేదు. తిండి, దుస్తులు, చిన్నచిన్న వస్తువుల కోసం కూడా   అప్పులపై ఆధారపడుతున్నారు. వివిధ కారణాల వల్ల భారతదేశంలో డబ్బును అప్పు తీసుకోవడం ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి  మారింది. ఫోన్లు, కార్లు, ఇండ్లు వంటి వాటన్నింటికీ బ్యాంకు/ఎన్​బీఎఫ్​సీ లోన్లను ఆశ్రయిస్తున్నారు. గడిచిన పదేళ్లుగా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఇండస్ట్రియల్​ లోన్లు ఇవ్వడం రిస్క్​ కాబట్టి బ్యాంకులు,  ఆర్థిక సంస్థలు రిటైల్ లోన్లపై దృష్టి సారిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ వంటి ఎన్​బీఎఫ్​సీలో గడిచిన పదేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలుగా మారాయి. ఇల్లు కొనడం మొదలుకొని స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ వరకు ప్రతిదానికీ అప్పులు ఇస్తున్నాయి. గత పదేళ్లలో బజాజ్ ఫైనాన్స్,హెచ్​డీఎఫ్​సీలు భారీగా ఎదిగాయి.  తక్కువ వడ్డీ రేట్లు ఉన్నకాలంలో ఇవి గణనీయమైన వృద్ధి సాధించాయి. ఇప్పుడు వడ్డీలు ఎక్కువ కాబట్టి   గతంలో మాదిరి వృద్ధిని సాధించలేకపోవచ్చు. అయితే ఇప్పుడు అధిక వడ్డీకి లోన్లు తీసుకోవాలి కాబట్టి బారోవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  

ఊబి నుంచి బయటపడేదెలా ?

అభిషేక్ సేన్ (పేరు మార్చాం) బెంగళూరులో ఎడ్-టెక్ కంపెనీలో సేల్స్ ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. 2020 నుంచి ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయి. కరోనా వల్ల జీతం తగ్గింది. సేన్‌‌‌‌‌‌‌‌కు రూ.20 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో 15 అప్పులు ఉన్నాయి.  తీర్చడానికి తగినంత ఆదాయం లేదు.  వ్యక్తిగత అప్పుతోపాటు, కన్జూమర్​ లోన్లు, ఆరు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆయన జీతం కంటే చెల్లించే  వడ్డీయే ఎక్కువ!  కరోనాకు ముందు కూడా ప్రతి నెల 10వ తేదీ తర్వాత కిస్తీలను కట్టడం కష్టమయ్యేదని చెప్పారు.  కోల్‌‌‌‌‌‌‌‌కతాకు చాలా దూరంలో ఉన్న కౌశిక్​దీ (పేరు మార్చాం )  ఇదే పరిస్థితి. ఆయన  ఒక ఐటీ సర్వీసెస్ ప్రొఫెషనల్. డేటా సైన్స్ కోర్సు మొత్తాన్ని క్రెడిట్ కార్డుతో చెల్లించారు. కరోనా వల్ల జీతంలో దాదాపు 40శాతం కోత పడింది. ఒక సంవత్సరంలో అప్పు రూ.6 లక్షలకు పైగా పెరిగింది. అప్పులు, క్రెడిట్​కార్డుల బిల్లులు చెల్లించలేక ఈయన సతమతమవుతున్నారు.   

 “భారతదేశం కూడా పశ్చిమ దేశాలను కాపీ కొడుతోంది. క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌లు, యాప్ లోన్‌‌‌‌‌‌‌‌లు, బయ్​ నౌ పే లేటర్​ స్కీములు విపరీతంగా పెరుగుతున్నాయి.   ఫైనాన్స్ సులభంగా వస్తోంది.  అప్పుల్లో కూరుకుపోయిన భారతీయ కుటుంబాల సంఖ్య పెరుగుతోంది.   గ్రామీణ  కుటుంబాలలోనూ రుణభారం పెరుగుదల తీవ్రంగా ఉంది. ఇది పట్టణ ప్రాంతాల కంటే 84 శాతం కంటే ఎక్కువ ” అని డెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ ‘సింగిల్ డెట్’ ఫౌండర్​ హరీష్ బి పర్మార్ చెప్పారు. ఏకంగా రూ.87 లక్షలకు పైగా అప్పు కావాలంటూ తన దగ్గరకు ఒక క్లయింట్‌‌‌‌‌‌‌‌  వచ్చారన్నారు. ఆయనకు ఇప్పటికే 37 కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని, వాటిలో 28 యాప్ లోన్ల నుంచి తీసుకున్నవని వివరించారు. రూ.2 లక్షలకు పైగా జీతం వస్తున్నా వడ్డీలకే ఆయన సంపాదన సరిపోవడం లేదని అన్నారు. చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందన్నారు. 

మంచి అప్పు... చెడ్డ అప్పు

ఇల్లు కొనడానికి అప్పు తీసుకున్న వారికి మాత్రమే తమ ఆర్థిక పరిస్థితిపై కొంత అవగాహన ఉంటోందని బ్యాంకింగ్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఇలాంటి వారు అప్పును చెల్లించడానికి ముందే ప్లాన్లను వేసుకొని ఉంటారు.  కార్ల లోన్లకు కూడా కొంత వరకు ఇది వర్తిస్తుంది. టీవీ, ఫ్రిజ్​ వంటి కన్జూమర్​ డ్యూరబుల్స్, లేదా క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌లపై అప్పులు చేసే వాళ్లు చిక్కుల్లో పడుతున్నారు. వీరిలో చాలా మంది ఎలాంటి ఆలోచనా లేకుండా అప్పు తీసుకుంటున్నారు. దుస్తులు, తిండి వంటి చిన్నచిన్న అవసరాల కోసం కూడా జనం అప్పులకు ఎగబడుతున్నారని  ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్​ మిలన్ శర్మ చెప్పారు. ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఈజీగా నిధులు లభ్యం కావడం వల్ల మార్కెట్లో లోన్లు బాగా దొరుకుతున్నాయని చెప్పారు. 

అమెరికాలో మొత్తం అప్పుల్లో 75 శాతం కంటే ఎక్కువ రిటైల్ అప్పుల్లో హోం  లోన్లు, ఆటోలోన్సే ఉంటాయని, మిగిలినవి అన్​సెక్యూర్డ్​ లోన్లు అని యూఎస్​లో  డెట్-రిలీఫ్ ప్రొఫెషనల్ గా పనిచేసిన రితేష్ శ్రీవాస్తవ చెప్పారు.  భారతదేశంలో కుటుంబ సగటు అప్పుల్లో హోంలోన్లు కేవలం 30శాతం మాత్రమే కాగా, మిగతావి గోల్డ్​, అన్​సెక్యూర్డ్​ లోన్లు ఉంటాయని అన్నారు. జనం కన్జూమర్​ డ్యూరబుల్ లోన్లు విపరీతంగా తీసుకుంటున్నారు. ఇవి 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.37,349 కోట్లకు.. అంటే  89 శాతం పెరిగాయి. కుటుంబ సగటు అప్పులు ఏటా 12 శాతం,  ఆటో లోన్లు 14శాతం పెరుగుతున్నాయి.  2022 ఆర్థిక సంవత్సరంకి రిటైల్ క్రెడిట్ మొత్తం రూ.34 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.     పొదుపు చాలా తక్కుగా ఉండటం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని శ్రీవాస్తవ చెప్పారు.  మనదేశం అప్పుల ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నదన్నారు.