
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లీకూతురు తెలంగాణ ఎస్సై ఈవెంట్లో పాస్ అయ్యారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని అనే తల్లి కూతుళ్లు పోలీస్ ఉద్యోగ ఎంపికలో పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ ఫుట్ విభాగాలలో పోటీ పడి ఇద్దరూ అర్హత సాధించారు. ఖమ్మం రూరల్ మండలం రామన్న పేట గ్రామంలో ఓ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నాగమణి.. విద్యార్థి దశనుంచే ఇటు చదువులోనూ, అటు క్రీడల్లోనూ రాణించేది. పాఠశాల, కళాశాల క్రీడల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు ఎన్నో అందుకుంది.
ఆర్ధిక పరిస్థితులు, పైగా ఆడపిల్ల కావడంతో తండ్రి పెళ్లి చేసి, అత్తారింటికి పంపించారు. అయినా నాగమణిలో మాత్రం ఏదో సాధించాలన్న తపన. ఆ కసితోనే అంగన్ వాడి ఉద్యోగం సాధించింది. పోలీసు కావాలనే తన చిన్నప్పటి కోరిక మేరకు హోంగార్డు ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇలా అంచెలంచెలుగా తన పట్టుదలతో ఎదిగింది. అయినా సంతృప్తి చెందని కానిస్టేబుల్ నాగమణి ఈ ఏడాది వచ్చిన ఎస్సై నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకొని, తన కూతురు త్రిలోకినితో కూడా దరఖాస్తు చేపించింది.
ప్రిలిమ్స్ లో నెగ్గి, తనకున్న అవగాహనతో గ్రౌండ్‌కు కూతురును తీసికెళ్లి, తనతో పాటు కూతురికి కూడా మెళకువలు నేర్పింది. అదృష్టం కొద్దీ తల్లికూతుళ్లకి ఒకే రోజు ఈవెంట్స్ కావడం, మళ్లీ ఒకే బ్యాచ్ రావడంతో తల్లి కూతుళ్లు పోటీ పడీ మరీ అర్హత సాధించారు. ఇది చూసిన అక్కడి పోలీసు అధికారులు, మిగతా అభ్యర్థులు తనయమించిన తల్లి అని అభినందించారు. వెంటనే ఓ ఫోటో కొట్టి, పోలీసుఉద్యోగానికి తళ్లీకూతుళ్ళు అనే టైటిల్ పెట్టి, సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ పోస్ట్ కాస్త ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగమణి ములుగు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది.