వలస కూలీలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు

వలస కూలీలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు
  • ఫతేపూర్‌‌ దగ్గర్లో తల్లి, కూతురు మృతి
  • మరో కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగాఘటన

ఫతేపూర్‌‌: కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయి సొంత ఊళ్లకు చేరుకునేందుకు వేలాది కిలోమీటర్లు నడుస్తున్న వలస కూలీలను ప్రమాదాలు కబళిస్తున్నాయి. సొంత వాళ్ల దగ్గర కనీసం గంజి తాగి బతకొచ్చనే ఆశలతో కష్టాన్ని సైతం భరిస్తూ పిల్లల్ని ఎత్తుకుని ఎండలో నడుస్తున్న కూలీలను రోడ్డు ప్రమాదాలు బలి తీసుకుంటున్నాయి. మహారాష్ట్ర నుంచి యూపీకి కూలీలతో వస్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో తల్లీ, కూతురు ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని ఫతేపూర్‌‌ దగ్గర సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురు ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరికొద్ది సేపటికి వారంతా ఇళ్లకు వెళ్లిపోతారనగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. మంగళవారం తెల్లవారుజామున హర్యానా, యూపీల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వలస కూలీలు చనిపోగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.