
దుబ్బాక, వెలుగు : భర్తతో విడిపోయేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ 52 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరుకు చెందిన శ్రీమాన్, నంగునూరు మండలం నర్మెటకు చెందిన కవిత మూడేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీమాన్ రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో.. గ్రామంలో పరువు పోయిందని భావించి ఇటీవల తన అమ్మమ్మ ఊరైన దుబ్బాక మండలం అప్పనపల్లికి షిఫ్ట్ అయ్యారు. భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత అతడితో విడిపోవాలని నిర్ణయించుకుంది.
ఇందుకు పసికందు అడ్డుగా ఉండడంతో అతడిని తప్పిస్తే భర్తతో విడిపోయి హాయిగా ఉండొచ్చని భావించింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో 52 రోజుల వయస్సు ఉన్న కొడుకు దీక్షిత్‌ను గ్రామ శివారులోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చి తన బాబును ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే బావిలో పడేసినట్లు ఒప్పుకుంది. శ్రీమాన్ ఫిర్యాదుతో కవితను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.