ఐసీయూలో తల్లి.. ఆచూకీ లేని తండ్రి

ఐసీయూలో తల్లి..  ఆచూకీ లేని తండ్రి
  • సెక్యూరిటీ గార్డుల దగ్గర ఆరేండ్ల బాలుడు 
  • గాంధీ దవాఖానలో దయనీయ ఉదంతం

పద్మారావునగర్, వెలుగు :  హైదరాబాద్​ గాంధీ దవాఖానలో ఓ తల్లి అత్యవసర పరిస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగా..తండ్రి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో వారి ఆరేండ్ల కొడుకు నాన్న ఎటుపోయాడో తెలియక...తల్లికి ఏమైందో అర్థం కాక ఏడుస్తున్నాడు. ఈనెల1న నిజామాబాద్​లోని సలూర క్యాంప్​కు చెందిన మాధవి (30)ని రెండో కాన్పు కోసం ఆమె భర్త గంగాధర్ ​గాంధీ దవాఖానకు తీసుకువచ్చి అడ్మిట్​చేశాడు. వీరితో పాటు ఆరేండ్ల కొడుకు సాత్విక్​(6)ను కూడా తీసుకువచ్చారు. డెలివరీ సందర్భంగా పుట్టిన శిశువు చనిపోగా..మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

దీంతో ఆమెను ఎంఐసీయూ (మెటర్నిటీ ఇంటెన్సివ్​ కేర్ ​యూనిట్) లోకి మార్చారు. మంగళవారం అర్ధరాత్రి సాత్విక్​ దవాఖానలో ఒంటరిగా తిరుగుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి గార్డు రూమ్​కు తీసుకొచ్చారు. బాలుడు వివరాలు సరిగ్గా చెప్పకవడంతో ఫ్యామిలీ మెంబర్స్ గురించి వెతికారు. చివరకు గంగాధర్ తన ​కొడుకును, భార్యను విడిచిపెట్టి వెళ్లినట్టు తెలిసింది. సాత్విక్​ను తల్లి దగ్గరకు తీసుకువెళ్తే అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె గుర్తు పట్టడం లేదు. దీంతో మూడు రోజులుగా సెక్యూరిటీ క్యాబిన్​లో ఆశ్రయం కల్పించి టిఫిన్, భోజనం పెడుతున్నామని సెక్యూరిటీ చీఫ్​ శివాజీ తెలిపారు. బాలుడి తల్లికి కూడా దవాఖాన పేషంట్​ కేర్ ​సిబ్బంది సపర్యలు చేస్తున్నారు.