బీమా చేయించి మరీ ఘోరం: ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసిన తల్లి

బీమా చేయించి మరీ ఘోరం: ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసిన తల్లి

లక్నో: ప్రియుడితో కలిసి ఉండడంపై కొడుకు ఆగ్రహించాడని ఓ మహిళ దారుణమైన కుట్ర చేసింది. ప్రియుడితో కలిసి కొడుకును హత్య చేయించింది. చాలా రోజుల ముందుగానే ప్లాన్ చేసి భారీ మొత్తంలో కొడుకుకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే, మృతుడి తాత ఫిర్యాదుతో పోలీసులు జరిపిన దర్యాప్తులో దారుణ వివరాలు బయటపడ్డాయి. ప్రియుడితో కలిసి కొడుకు హత్యకు పక్కా ప్లాన్ చేసి, కొడుకు పేరుమీద ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుందని తేలింది. దీంతో పోలీసులు ఆ మహిళను, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన ఇతర నిందితులను అరెస్టు చేశారు.

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

కాన్పూర్ దేహత్‎కు చెందిన ప్రదీప్ శర్మ (23) తండ్రి కొన్నేండ్ల క్రితం మరణించారు. ప్రదీప్ తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే మయాంక్ అనే వ్యక్తితో ప్రదీప్ తల్లికి వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయంపై ప్రదీప్ తల్లితో గొడవపడ్డాడు. అయినా తల్లి వినకపోవడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‎లో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు తనను నిలదీయడంతో ఆగ్రహించిన తల్లి.. కొడుకును హత్య చేసేందుకు తన ప్రియుడు మయాంక్‎తో కలిసి ప్లాన్ వేసింది.

దీపావళి తర్వాత హత్య..

దీపావళి సందర్భంగా సొంతూరుకు వచ్చిన ప్రదీప్‎ను డిన్నర్ చేసొద్దామంటూ మయాంక్‌, రిషిలు బయటకు తీసుకెళ్లారు. కారులో వెళుతుండగానే సుత్తితో తలపై మోదీ ప్రదీప్‎ను చంపేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, ప్రదీప్ తాత ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రదీప్ తల్లిని గట్టిగా ప్రశ్నించడంతో  ఈ హత్యోదంతం బయటపడింది.