తెలంగాణ కిచెన్: డ్రాగన్​తో డెలీషియస్​గా..నోరూరించే రెసిపీస్..

తెలంగాణ కిచెన్: డ్రాగన్​తో డెలీషియస్​గా..నోరూరించే రెసిపీస్..

డ్రాగన్ ఫ్రూట్.. నిజానికిది విదేశీ పండు. కానీ, ఇప్పుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు. వీటిలో రకరకాల వెరైటీలు కూడా ఉన్నాయి.  చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొందరు ఈ ఫ్రూట్​ని నేరుగా తినడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాంటివాళ్లకు ఈ పండుతో ఈ రెసిపీలు చేసి పెడితే.. నోరూరిపోవడం ఖాయం. మరింకేం.. వెంటనే షురూ చేయండి.

జామ్ 

కావాల్సినవి :
డ్రాగన్ ఫ్రూట్స్ – రెండు, చక్కెర – ఒక కప్పు, నీళ్లు – సరిపడా, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్

తయారీ : డ్రాగన్ ఫ్రూట్స్ తొక్క తీసి ముక్కలుగా చేయాలి. వాటిని పాన్​లో వేసి, అందులోనే చక్కెర కూడా వేసి కలపాలి. చక్కెర కరిగి, మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించాలి. తర్వాత ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి కలపాలి. జామ్​లాగ తయారయ్యాక కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఆపై గాలిచొరబడని ఒక గాజు జాడీలో వేసి మూతపెట్టారంటే కావాల్సినప్పుడు తీసి తినొచ్చు. దీన్ని ఫ్రిజ్​లో పెడితే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.

స్మూతీ

కావాల్సినవి :
డ్రాగన్ ఫ్రూట్, అరటిపండు – ఒక్కోటి, ఓట్స్ – మూడు టేబుల్ స్పూన్లు, పాలు – అర కప్పు,
తేనె – ఒక టీస్పూన్, డ్రైఫ్రూట్స్ – కొన్ని 

తయారీ : ఒక గిన్నెలో ఓట్స్ వేసి పాలు పోసి మూతపెట్టి రాత్రంతా నానబెట్టాలి. మిక్సీజార్​లో డ్రాగన్ ఫ్రూట్, అరటి పండు ముక్కలు, నానబెట్టిన ఓట్స్, తేనె వేసి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి పైన డ్రైఫ్రూట్స్ చల్లితే సరి. అంతేకాదు.. డ్రైఫ్రూట్స్ బదులు చియా గింజలు, పండ్ల ముక్కలు కూడా వేసుకోవచ్చు. 


ఐస్​ఫ్రూట్

కావాల్సినవి :
డ్రాగన్ ఫ్రూట్ – ఒకటి, చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు, పాలు – పావు కప్పు, మిల్క్ మెయిడ్ – ఒక టేబుల్ స్పూన్

తయారీ : మిక్సీజార్​లో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, చక్కెర, మిల్క్ మెయిడ్ వేసి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఐస్​ క్రీమ్ మౌల్డ్స్​లేదంటే చిన్న గ్లాసులో పోయాలి. దాన్ని మూడుగంటల పాటు డీప్​ ఫ్రిజ్​లో పెట్టారంటే ఐస్​ఫ్రూట్ రెడీ. 


డెజర్ట్ 

కావాల్సినవి :
డ్రాగన్ ఫ్రూట్​ – రెండు, నీళ్లు – కొన్ని, చక్కెర – అర కప్పు, కార్న్​ ఫ్లోర్ – పావు కప్పు, ఉప్పు – పావు టీస్పూన్,  వెన్న – ఒక టీస్పూన్

తయారీ : మిక్సీజార్​లో డ్రాగన్​ ఫ్రూట్ ముక్కలు వేసి, నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. తర్వాత పాన్​లో పోసి చక్కెర, కార్న్​ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. అవన్నీ కలిసిపోయి మిశ్రమం బాగా మరిగాక వెన్న వేసి కలపాలి. నీరంతా ఇంకిపోయి మిశ్రమం గట్టిపడ్డాక తీసి నెయ్యి పూసిన గిన్నెలో వేయాలి. చల్లారాక దాన్ని ముక్కలుగా కట్ చేయాలి. ఆపై చక్కెరలో దొర్లించి తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది.