సూర్యాపేటలో సింగిల్ ఇండ్లపై కదలిక .. 74 కోట్లతో ప్రపోజల్స్ పంపించిన అధికారులు

సూర్యాపేటలో సింగిల్ ఇండ్లపై కదలిక .. 74 కోట్లతో ప్రపోజల్స్ పంపించిన అధికారులు
  • గత ప్రభుత్వంలో మధ్యలోనే నిలిచిన 2,160 ఇండ్లు  
  • ఇటీవల రివ్యూ నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
  • అంచనాలు రెడీ చేస్తే మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ

సూర్యాపేట, వెలుగు: హుజుర్ నగర్‌‌‌‌లో గత ప్రభుత్వ హయాంలో మధ్యలోనే నిలిచిపోయిన 2,160 సింగిల్ బెడ్‌‌ రూం ఇండ్ల నిర్మాణాలపై కదలిక మొదలైంది. కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడంతో ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి  ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి ఇటీవల ఆ ఇండ్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి పెండింగ్‌‌లో ఉన్న ఇండ్లను మూడు నెలల్లో పూర్తి చేస్తామని, అందుకు కావల్సిన బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు రూ. 74 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేసి మంత్రులకు పంపించారు. 

సగంలోనే ఆగిన పనులు

పేదల సొంటింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్‌‌‌‌ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద ఉన్న దేవాదాయ శాఖ భూముల్లో  2,160 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయిచింది.  ఇందుకోసం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన  77.31ఎకరాల భూమిని  రెవెన్యూ శాఖకు అప్పగించి రాజీవ్ గృహ కల్ప కింద 98.50 కోట్లు మంజూరు చేసింది.  అనంతరం 135 బ్లాకుల్లో 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.  రూ.38 కోట్లు రిలీజ్ కాగా దాదాపు సగం పనులను పూర్తయ్యాయి. ఆ తర్వాత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఏర్పడడంతో రాజీవ్ గృహకల్ప పథకాన్ని రద్దు చేసింది. దీంతో 2014 సెప్టెంబర్‌‌‌‌లో ఇండ్ల  పనులను ఆపేశారు. 

నెరవేరని గత ప్రభుత్వ హామీ

ఎమ్మెల్యేగా గెలిపిస్తే మధ్యలో ఆగిపోయిన ఇండ్ల  స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని హుజూర్ నగర్ బై ఎలక్షన్ సమయంలో సైదిరెడ్డి హామీ ఇచ్చారు. గతంలో అప్పటి మంత్రులు కే‌‌టీఆర్, జగదీశ్‌‌ రెడ్డి హుజూర్ నగర్‌‌‌‌లో పర్యటించి ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రపోజల్స్ పంపిస్తే బడ్జెట్ రిలీజ్‌‌ చేస్తామని కేటీఆర్‌‌‌‌ ఆదేశించగా..  రూ.80 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఎన్నికలకు ముందు రూ.30 కోట్లు మంజూరు చేశారు. పనులను మాత్రం మొదలు పెట్టలేదు.

 రూ.74 కోట్లతో ప్రపోజల్స్‌‌

పెండింగ్‌‌లో ఉన్న 2160 సింగిల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక వసతులు కల్పన, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ , ఇంటర్నల్ రోడ్లు, రెనోవేషన్ కోసం ఎన్నికల ముందు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. ఇండ్లను పూర్తి కావాలంటే ఈ నిధులతో పాటు మరో రూ. 44 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం రూ. 74 కోట్లతో ప్రపోజల్స్‌‌ పంపించారు.  

ప్రపోజల్స్‌‌ పంపించినం  

పెండింగ్‌‌లో ఉన్న ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మంత్రుల ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి ఆదేశాల మేరకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాం.  అక్కడి నుంచి ఆదేశాలు రాగానే పనులను ప్రారంభిస్తాం. 

 శీలం, ఈశ్వరయ్య, ఎస్‌‌ఈ, పంచాయతీ రాజ్ 

బడ్జెట్ రాగానే పనులు చేస్తాం 

ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే టెండర్లు పిలిచి బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తాం. మంత్రుల ఆదేశాల మేరకు ఇప్పటికే పనుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నం. త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తం.

 రవీందర్ రావు, హౌసింగ్ ఈ‌‌ఈ