కరెంట్​ పోల్స్​ సాయంతో గ్రామస్తుల రాకపోకలు

కరెంట్​ పోల్స్​ సాయంతో గ్రామస్తుల రాకపోకలు
  • ఎడతెరిపి లేని వానలతో కొట్టుకుపోయిన రోడ్డు
  • కరెంట్​ పోల్స్​ సాయంతో గ్రామస్తుల రాకపోకలు 
  • పట్టించుకోని లీడర్లు, అధికారులు

గంగాధర, వెలుగు: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని ఇస్తారిపల్లి రోడ్డు కొట్టుకుపోయింది. అయినా గ్రామస్తుల ఇబ్బందులు ఎవరూ పట్టించుకోవడం లేదు. నెలన్నర క్రితం నారాయణపూర్, ఎల్లమ్మ చెరువులకు గండి పడడంతో ఊరంతా నీరు చేరింది. గంగాధర నుంచి ఇస్తారిపల్లికి వెళ్లే బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో గంగాధర సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్, నారాయణపూర్ సర్పంచ్ ఎండీ.నజీర్ తాడు సాయంతో గ్రామస్తులకు కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర వస్తువులను ఇవతలి ఒడ్డు నుంచి అవతలికి చేర్చి గ్రామస్తుల అవసరాలు తీర్చారు.

వరదలు తగ్గగానే తాత్కాలిక రహదారి నిర్మించారు. నాలుగు రోజులుగా ఆగకుండా వానలు కురుస్తుండడంతో తాత్కాలిక రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. పాలు, కూరగాయలు తెచ్చుకోవడానికి మూడు రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజలు కరెంట్ పోల్స్​ను అడ్డుగా వేసుకుని ఒర్రె దాటుతూ కావలసిన వస్తువులు గంగాధరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. అధికారులు, లీడర్లు ఇప్పటికైనా స్పందించి  బ్రిడ్జి నిర్మించాలని ఇస్తారిపల్లి ప్రజలు వేడుకుంటున్నారు.