సిన్మాటాకీస్ లు నాలుగైదు నెలల వరకు ఓపెన్ కావు!

సిన్మాటాకీస్ లు నాలుగైదు నెలల వరకు ఓపెన్ కావు!

హైదరాబాద్‌‌, వెలుగు సినిమా థియేటర్లు మరో నాలుగైదు నెలల వరకు ఓపెన్‌‌ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, జనంలో కరోనా ఫోబియా పోయేదాకా అవి తెరుచుకుంటాయని తాను అనుకోవడం లేదని ఫిల్మ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ (ఎఫ్​డీసీ)  చైర్మన్‌‌ రామ్మోహన్‌‌ రావు అన్నారు. లాక్​డౌన్​ సడలింపుల్లో లాస్ట్​ ఉండేది థియేటర్లే కావొచ్చని అభిప్రాయపడ్డారు. థియేటర్లు చాలా నష్టాల్లో ఉన్నాయని.. సినిమా, టీవీ రంగాల్లో షూటింగ్స్​ నిలిచిపోయి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని సినిమా, టీవీ రంగాలతోపాటు థియేటర్ల పరిస్థితిపై ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు.  ఆయా రంగాల నుంచి వస్తున్న డిమాండ్లను వివరించారు.

ఈ నెల 29 తర్వాత మీటింగ్​

ఈ నెల 29 తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్‌‌ ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్​రావు చెప్పారు. వారి సమస్యలు తెలుసుకొని, కొన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ‘‘ఈ నెలాఖరుకు పోస్ట్‌‌ ప్రొడక్షన్‌‌కు అనుమతి లభిస్తుంది. జులైలో టీవీ షూటింగ్‌‌లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. సినిమా షూటింగ్‌‌లకు మాత్రం కొంత సమయం పడుతుంది. టీవీ షూటింగ్‌‌లు చాలా తక్కువ మందితో జరుగుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఈజీ అవుతుంది.  షూటింగుల్లో ఎక్కువ మంది ఉంటారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల నుంచి వచ్చే ఫీడ్‌‌బ్యాక్‌‌ను బట్టి  షూటింగ్‌‌లను ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయం జరుగుతుంది’’ అని వివరించారు. అయితే లాక్‌‌డౌన్‌‌ విషయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపైనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయని, అప్పటి వరకు ఏది చెప్పినా గెస్  మాత్రమే అవుతుందన్నారు.

చాలా డిమాండ్లు వస్తున్నయి

థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి చాలా డిమాండ్లు వస్తున్నాయని రామ్మోహన్​రావు చెప్పారు. లాక్‌‌డౌన్‌‌ పీరియడ్‌‌లో థియేటర్లు పూర్తిగా మూత పడ్డందున ప్రభుత్వం ఏదైనా నష్ట పరిహారం ఇస్తుందా అని అడుగుతున్నారని పేర్కొన్నారు. థియేటర్లు తెరిచాక ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలంటే సగం సీట్లను వదిలేయాల్సి వస్తుందని, దాంతో టికెట్‌‌ రేట్లు పెంచాల్సిన వస్తుందేమోనని ఆయన అన్నారు. మరి ప్రేక్షకులు ఇంత రేట్లు భరించి థియేటర్‌‌కు వస్తారా అన్నది కూడా సందేహంగానే ఉందని పేర్కొన్నారు. వ్యూయర్లు లేకపోతే థియేటర్ల నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. చెప్పారు. ‘‘రెండు మూడేండ్ల పాటు మున్సిపల్‌‌ ట్యాక్సు నుంచి మినహాయింపు అడుగుతున్నరు. సినిమాలకు టికెట్ల రేట్లు ఫ్లెక్సిబుల్‌‌గా పెట్టుకోనీయమనే డిమాండ్‌‌ వచ్చింది. థియేటర్ల నుంచి కరెంట్‌‌ చార్జీలను కమర్షియల్‌‌ రేట్లుగా వసూలు చేస్తున్నరు. కానీ, ఇండస్ట్రియల్‌‌ రేట్‌‌ వసూలు చేయాలని అడుగుతున్నరు. సినీ ఫీల్డ్‌‌ను ఇండస్ట్రియల్‌‌ కేటగిరీగా చూడాలని చాలా రోజుల నుంచి డిమాండ్‌‌ ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. షూటింగ్‌‌లకు లొకేషన్‌‌ చార్జీల నుంచి మినహాయింపులు అడుగుతున్నారని, వేరే టాక్సుల నుంచి ఎక్సెంప్షన్‌‌ కోరుతున్నారని చెప్పారు.

తెలంగాణకు నేషనల్​ ఫిల్మ్​ ఇండస్ట్రీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రం తొందరగానే కోలుకుంటుందనే నమ్మకం తనకు ఉందని రామ్మోహన్‌‌ రావు అన్నారు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు. నేషనల్‌‌ ఫిల్మ్‌‌ ఇండస్ట్రీ కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్నారు. రెండు, మూడేండ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యాపారం ఇప్పుడున్న దానికన్నా 3, 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇండస్ట్రీ నుంచి వస్తున్న అన్ని డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తున్నామన్నారు.

54 రోజుల్లో 562 కేసులు..5 కోట్లు కొట్టేసిన్రు