వైఎస్ వివేకా హత్య కేసులో తెరపైకి మరో పేరు

వైఎస్ వివేకా హత్య కేసులో తెరపైకి మరో పేరు

మాజీ మంత్రి,మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డికి రెండో వివాహం అయిందా..? వైఎస్ వివేకానందరెడ్డి మతం మారారా..?  ఆయన పేరును కూడా మార్చుకున్నారా..? సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజు రోజుకు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విషయాలను బయటపెట్టింది ఎవరో కాదు..వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. శుక్రవారం సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..తన బాబాయ్ హత్య కేసులో సంచలన విషయాలను వెల్లడించారు. 

వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం..!

వైఎస్  వివేకానందరెడ్డికి 2006 నుంచి ఒక మహిళతో సంబంధం ఉందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు.  షేక్ షమీమ్‌ను అనే మహిళను 2011లో  పెళ్లి కూడా చేసుకున్నారని వెల్లడించారు. అయితే ఆమె ముస్లిం మహిళ కావడంతో..బాబాయ్ మతం కూడా మార్చుకున్నారని చెప్పారు. ఆ వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం తన పేరును షేక్‌ మహమ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరికి షేక్ షెహన్‌షా అనే అబ్బాయి జన్మించాడని..అతన్ని భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకానందరెడ్డి దృఢంగా భావించినట్లు వివరించారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే నంటూ చెప్పుకొచ్చారు.

ఆస్తికోసమై ఉండొచ్చు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత కొన్ని సీల్డ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు  వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు. ఇందులో తన ఆస్తిని వివేకానందరెడ్డి తన రెండో భార్య.. కుమారుడు షెహెన్ షా పేరు మీదికి బదలాయించేలా నోటరీ చేసిన వీలునామా.., కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. రూ.8 కోట్ల  పంపకాల మీద గొడవలు జరిగాయనే విషయాన్ని అప్రూవర్ స్టేట్ మెంట్లో ఉందన్నారు. ఆ మొత్తాన్ని తానే తీసుకుంటానని వివేకా.. చెరి సగం కోసం మరో వ్యక్తి పట్టుబట్టడంతోనే  ఈ హత్యకు దారి తీసినట్టుగా పొందుపర్చారని అన్నారు. బెంగళూరు ప్రాపర్టీ విషయంలో 8 మంది ప్రత్యక్ష సాక్షుల వద్ద సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేశారని చెప్పారు. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఓ లెటర్ ను ఇప్పటి వరకు ఎందుకు  దాచి పెట్టారని ప్రశ్నించారు. వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ ఈ లెటర్ ను దాచి పెట్టారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ హత్య వెనక ఉన్న రాజకీయ కుట్రలను ఛేదిస్తామన్నారు.  న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని  అవినాష్‌ రెడ్డి తెలిపారు.