దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేసిండు

దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేసిండు

రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని.. వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేశాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా తప్పుడు లెక్కలు చెబుతుందని ఆయన మండిపడ్డారు. భూకబ్జా చేశాడని మంత్రి ఈటలను తప్పించారని.. ఆయన ఒక్కడే కాకుండా టీఆర్ఎస్ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కబ్జాదారులేనని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘తెలంగాణలో ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. కరోనాతో ప్రజలు చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, వెంటిలేటర్లు కేంద్రం ఇచ్చినా వాడుకొకపోవడంతో పాటు కేంద్ర నిధులను దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. కరోనా నియంత్రణలో మేం ప్రభుత్వానికి సహకరిస్తం. సీఎం కేసీఆర్ కరోనాపై ఒక్క రివ్యూ చేయడు. ప్రజలకు కరోనాపై భరోసా ఇవ్వడు. కానీ, మోడీ మాత్రం ప్రతిరోజూ రివ్యూలు చేస్తూ.. ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నడు. రాష్ట్రంలో కరోనాతో ఎంత మంది చనిపోయారో కూడా లెక్కలు చెప్తలేరు. దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మరణాల సంఖ్య తగ్గించి చూపిస్తున్నాడు. వాస్తవ విషయాల్ని ప్రభుత్వం దాస్తున్నది. ఈటెల రాజేందర్ శాఖను తప్పించాడని తెల్సింది. కేంద్రం ఎక్కువ డబ్బులు ఆరోగ్య శాఖకు ఇస్తుంది. దాంతో డబ్బులు ఎక్కువ ఉన్న శాఖను కేసీఆర్ తీసుకుంటుండు. ఎక్కువ డబ్బులున్న ఇరిగేషన్ శాఖను ఆయన వద్దే పెట్టుకున్నాడు. కేసీఆర్ ఇప్పటికే కరోనా విషయంలో పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆరోగ్య శాఖను ఆయన వద్దనే పెట్టుకున్నడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో? కేసీఆర్‌ కెబినేట్‌ది జులాయి ముఠా. అవినీతిని రెండు రకాలుగా విభజించిండు. అనుకూలంగా ఉన్న మంత్రులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చర్యలు ఉండవు. వ్యతిరేకంగా ఉన్న మంత్రులపై ఆరోపణలూ రాగానే విచారణ ఉంటుంది. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేసిండు. కేసీఆర్ కుటుంబానికి బినామీ వ్యక్తులు ఉన్నారు. డ్రగ్స్ కేసు ఏమైంది? అమీన్ పూర్ భూముల కథ ఏమైంది? 111 జీఓ ఉల్లగించిన కేటీఆర్ మీద ఎందుకు చర్యలు లేవు. కేసీఆర్‌కు నీతి నిజాయితీ  ఉంటే ఒక వ్యక్తిపై కాదు అందరిపై విచారణ చేయాలి. 2018 నుంచి ఏం చేసినవ్? ఫిర్యాదులు వచ్చిన మంత్రి మల్లారెడ్డిపై విచారణ ఎందుకు చేస్తలేరు. ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ భూకబ్జా చేసిండు. బాధితులు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా విచారణ ఎందుకు చేస్తలేరు? మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 500 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జాలు చేసిండు. కబ్జాలను వ్యతిరేకించిన కలెక్టర్ దేవసేనను ట్రాన్స్‌ఫర్ చేసిండు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలున్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మీద భూకబ్జా ఆరోపణలున్నాయి. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కబ్జాలకు లెక్కే లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా  ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు. కేసీఆర్ కుటుంబానికి బినామీ అయిన శంభీపూర్ రాజు కూడా కబ్జా చేసిండు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నయి. మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇంతమందిపై ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణ చేస్తలేరు. సీఎం వెంటనే వీళ్లందరిపై సీబీఐతో విచారణ చేయించాలి లేకపోతే వీరిని పదవుల నుంచి తొలగించాలి. వీటన్నింటికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.