జహీరాబాద్​లో బీఆర్ఎస్ ​డీలా

జహీరాబాద్​లో బీఆర్ఎస్ ​డీలా
  • గులాబీ పార్టీకి షాక్​ ఇచ్చిన సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్​కు బీజేపీ టికెట్​ 
  • కొత్త అభ్యర్థిని వెతికే పనిలో బీఆర్ఎస్​
  • కాంగ్రెస్​నుంచి బరిలో సురేశ్​ షెట్కార్​? 
  • వేడెక్కిన రాజకీయం 

సంగారెడ్డి, వెలుగు:  ఉమ్మడి మెదక్​ జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో రాజకీయాలు హీటెక్కాయి. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. వెంటనే అతడిని జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించడం చక చకా జరిగిపోయాయి. దీంతో షాక్​ తిన్న బీఆర్ఎస్​ హైకమాండ్​ కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్  నుంచి మాజీ ఎంపీ సురేశ్​షెట్కర్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున 2019లో పోటీ చేసి ఓడిన మదన్ మోహన్ రావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో..ఈసారి మాజీ ఎంపీ సురేశ్​ షెట్కర్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

గెలుపు ధీమాలో కాంగ్రెస్​.. 

జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2009లో పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడగా మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఒకసారి, బీఆర్ఎస్​ రెండుసార్లు గెలిచాయి. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేశ్​షెట్కార్ టీఆర్ఎస్ అభ్యర్థి యూసుఫ్ అలీ మీద 17,407 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సురేశ్​ షెట్కార్​పై బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1.44 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మదన్​మోహన్​ రావుపై సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ 6,229  ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. 

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగుచోట్ల కాంగ్రెస్​ విక్టరీ కొట్టగా, బీఆర్ఎస్  రెండు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014తో పోల్చినప్పుడు 2019 నాటికి  బీఆర్ఎస్​కు, వ్యక్తిగతంగా బీబీ పాటిల్​కు ఆదరణ తగ్గింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో రావడంతో ఈ సెగ్మెంట్​లో గెలుపుపై కాంగ్రెస్ ​ధీమాగా ఉంది. మరోవైపు కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి గెలుపుతో పాటు  సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది.​ 

పట్టు కోల్పోతున్న గులాబీ పార్టీ..  

పార్లమెంట్​నియోజకవర్గ పరిధిలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాల్లోనే గెలిచిన బీఆర్ఎస్​జహీరాబాద్ పార్లమెంట్ స్థానంపై క్రమంగా పట్టు కోల్పోతోంది.  సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్​ పార్టీ మారడంతో అక్కడి క్యాడర్​ కూడా చేజారినట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మొన్నటి వరకు ఉమ్మడి మెదక్​ జిల్లా పరిధిలోని మరో పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మెదక్​లో ఆత్మీయ సమ్మేళనాలు, రాజకీయ సమీకరణాలు చేస్తూ హడావిడి చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు జహీరాబాద్ ను లైట్ ​తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కడా కనీసం మీటింగ్ పెట్టకపోవడం, ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడకపోవడంతో ఉన్న క్యాడర్ కూడా ​నారాజ్​అవుతోంది. 

 

అభ్యర్థి కోసం బీఆర్​ఎస్​ వేట

 
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్​ఎంపీ బీబీ పాటిల్​ను ప్రకటించడం, కాంగ్రెస్​కూడా సురేశ్​ షెట్కార్​ పేరును దాదాపు ఖాయం చేసినా బీఆర్ఎస్​మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకబడే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీ లోక్​సభ ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. ఈక్రమంలో సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.  మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు  నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితోపాటు కామారెడ్డికి చెందిన రియల్టర్ సుభాష్ రెడ్డిలను పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిలో ఎవరు ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.