- ప్రజా సంక్షేమంపై కేటీఆర్కు పట్టింపు లేదు : చామల కిరణ్కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : ప్రజల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు ఏమాత్రం పట్టింపులేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో కనీసం ఐదు నెలలు కూడా ఉండే ఓపిక బీఆర్ఎస్ నేతలకు లేకపోయిందన్నారు. వారిలో అప్పుడే అసహనం మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను చూసే ఓర్పు కూడా వారికి ఉండట్లేదన్నారు. ప్రతిపక్షంలో ఎలా ఉండాల్నో చంద్రబాబునాయుడు, మమతా బెనర్జీ వంటి నేతలను చూసి నేర్చుకోవాలని కేటీఆర్ కు సూచించారు.
బీఆర్ఎస్ ను ప్రజలు గద్దె దింపడానికి ఆ పార్టీ నేతల వైఖరే కారణమని, వారి దౌర్భాగ్య పాలన వల్లే రాష్ట్ర ఖజానా దిగజారిందన్నారు. పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తే.. బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందంతో తప్పుడు ప్రచారం చేయడం దారుణమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అని.. ఆయనకు కేటీఆర్ కు పోలిక ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని అంటున్న బండి సంజయ్ మాటలకు చేతైనతే కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
