కేటీఆర్ మా ఇంటికొచ్చారు.. కవితపైన విచారణ ఆపేస్తే.. BRS ను BJPలో విలీనం చేస్తమన్నరు

కేటీఆర్ మా ఇంటికొచ్చారు.. కవితపైన విచారణ ఆపేస్తే.. BRS ను BJPలో విలీనం చేస్తమన్నరు
  • కేటీఆర్ మా ఇంటికొచ్చారు.. సీసీ ఫుటేజీ ఉంది
  • అమిత్ షాతో మాట్లాడుమని రిక్వెస్ట్ చేశారు 
  • పతనమై పోయిన పార్టీని కలపుకొనేది లేదని అగ్ర నేతలు చెప్పిండ్రు
  • విలీనానికి ఒప్పించలేదనే నాపై తప్పుడు ఆరోపణలు
  • మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో నాకన్నీ తెలుసు
  • దీనిపై అన్ని ఆధారాలనూ సీబీఐ, ఈడీకి ఇస్తా 
  • కేటీఆర్ పై ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు


విశాఖపట్నం: లిక్కర్ స్కాంలో అరెస్టయిన కవిత సహా ఎవరిపైనా విచారణ జరగకుండా చూడాలని, బీజేపీలో బీఆర్ఎస్  ను విలీనం చేస్తామని కేటీఆర్ తనను రిక్వెస్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఇవాళ వైజాగ్ లో  ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీలో నంబర్ 7, టాలకటారా రోడ్డులోని మా ఇంటికి కేటీఆర్ వచ్చారు. మా ఇంట్లో  సీసీ ఫుటేజీ ఇప్పటికీ ఉంది. నేను వాళ్లింటికి వెళ్లలేదు. హోం మంత్రి అమిత్ షా సహా పార్టీ పెద్దలతో మాట్లాడుమని రిక్వెస్ట్ చేశారు. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడాను.  బీఆర్ఎస్ పతనమైపోయిన పార్టీ కలుపుకొనేది లేదని పెద్దలు చెప్పడంతో ఆ విషయం కేటీఆర్ కు చెప్పాను’ అని సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆ విద్వేషాన్ని మనసులో పెట్టుకున్న కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కంచ గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో నాకు ఎటువంటి టెండర్లు రాలేదు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం.. రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఎవరితోనైనా దోస్తానా చేస్తే టెండర్లు ఇస్తారా ? అని  ప్రశ్నించారు.  కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి చేసినవన్నీ తనకు తెలుసని, మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో, ఏం చేశారో కూడా తెలుసని తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని సీబీఐ, ఈడీకి ఇస్తానని ఎంపీ రమేష్  కేటీఆర్‌ను హెచ్చరించారు.

కేటీఆర్ కు చెల్లిపోరు

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏపీలో జగన్ మాదిరిగానే చెల్లిపోరు ఉందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. అందుకే మతి భ్రమించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్ అండ్ టీ & రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలల అయిందని చెప్పారు. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు  మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా? అని ప్రశ్నించారు. ‘మీ పార్టీ  టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా?  

తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే మా పార్టీకి కమ్మ నా కొడుకులు అవసరం లేదని.. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని,  ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా?  మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే రండి మీరు చెప్పిన చేయటకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దాం. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్రపరిణాలములు ఉంటాయి. అనవసరంగా నన్ను కెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుంది.’ అంటూ ఫైర్ అయ్యారు.