క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్.. ఫ్యామిలీని బాయ్ కాట్ చేస్తున్న‌ ఇరుగు పొరుగు

క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్.. ఫ్యామిలీని బాయ్ కాట్ చేస్తున్న‌ ఇరుగు పొరుగు

దేశంలో క‌రోనా వైర‌స్ కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతోంది. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అంటుకునే వ్యాధి కావ‌డంతో భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు సామాజిక దురాచారాలకు పాల్ప‌డుతున్న దుర‌దృష్టక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. జ‌లుబు, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించినా తోటి వారు విచిత్రంగా చూస్తున్నారు. వైర‌స్ బారిన‌ప‌డ‌కుండా కాపాడుకునేందుకు సామాజిక దూరంగా పాటిస్తూ జాగ్ర‌త్త ప‌డ‌డం అంద‌రికీ మంచిదే. కానీ, ఎవ‌రినైనా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రికి తీసుకెళ్లినా స‌రే.. ఇంకా టెస్టు రిపోర్టులు కూడా రాక‌ముందే ఆ వ్య‌క్తికి వైర‌స్ సోకిందంటూ సోష‌ల్ మీడియాల్లో వీడియోలు పెట్టేస్తున్నారు కొంద‌రు ఆక‌తాయిలు.

సోష‌ల్ బాయ్ కాట్ కాదు.. సోష‌ల్ డిస్టెన్స్ చాలు

ఇక క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబాల‌ను ఇరుగు పొరుగు మ‌రీ దారుణంగా చూస్తున్నారు. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత అత‌డి నుంచి సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం వ‌ర‌కు ఓకే కానీ, కొన్ని చోట్ల సోష‌ల్ బాయ్ కాట్ చేస్తున్నారు. బాధితుల‌కు సానుభూతితో చేత‌నైన సాయం చేయ‌డం మానేసి రోజువారీ స‌రుకులు కూడా అంద‌కుండా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఓ వ్య‌క్తికి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. శివ‌పురి ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడు క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. చికిత్స త‌ర్వాత పూర్తిగా కోల‌కుని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. ప్రాణాంత‌క‌ వైర‌స్ తో పోరాడి బ‌య‌ట‌ప‌డిన ఆ వ్య‌క్తి కుటుంబానికి ఇప్పుడు ఇరుగుపొరుగు తీరుతో క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. త‌న కుటుంబం న‌డిచిన దారిలో కూడా ఇత‌రుల‌ను న‌డ‌వొద్ద‌ని పొరుగింటి వాళ్లు చెబుతున్నారని అత‌డు తెలిపాడు. ఆఖ‌రికి త‌మ‌కు రోజూ ఇంటికి వ‌చ్చిన పాలు పోసే వ్య‌క్తిని కూడా రావొద్ద‌ని, వ‌స్తే అత‌డికి కూడా క‌రోనా వ‌స్తుంద‌ని భ‌య‌పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నిత్యావ‌స‌రాల‌కు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని, బ‌తుకు బండి న‌డిపించాలంటే ఇల్లు ఖాళీ చేసి మ‌రో చోట‌కు వెళ్ల‌డ‌మే మార్గ‌మ‌ని నైరాశ్యంతో చెబుతున్నాడ‌ను.