అధికారంలోకి రాగానే హామీలు మరిచిన్రు: ధర్మపురి అర్వింద్

అధికారంలోకి రాగానే హామీలు మరిచిన్రు: ధర్మపురి అర్వింద్

మెట్ పల్లి, వెలుగు: దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు పట్టించుకోలేదని, రైతులతో పాటు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ రైతుల దుష్మన్ పార్టీగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన ఛాయ్​పే చర్చ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ బీజేపీ పాలనలో పసుపు క్వింటాలుకు రూ.25 వేలు రేటు వచ్చిందన్నారు. వచ్చే ఏడాది 30 వేలు దాటే అవకాశాలున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు. కాగితాల్లోనే పసుపు బోర్డు ఉందని, బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడుగుతున్నారని, నిజామాబాద్ సభలో స్వయానా ప్రధాని ప్రకటించిన తర్వాత కూడా పసుపు బోర్డు రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. 

ఏండ్లుగా మంత్రి, ఎమ్మెల్యే గా పనిచేసిన జీవన్ రెడ్డి ప్రజల కోసం చేసిన మంచిపని ఏమీ లేదని, కానీ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది మాత్రం వాస్తవమన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్నంత కాలం దొంగ లెక్కలు, దొంగ పనులు చేస్తూ చెరుకు రైతులను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పి పదేండ్లు అధికారంలో ఉన్నా తెరిపించలేదన్నారు. రేపోమాపో తెలంగాణ కాంగ్రెస్ కెప్టెన్​పా ర్టీ నుంచి మాయమవుతారని సంకేతాలు వస్తున్నాయన్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మోరపల్లి సత్యనారాయణ, నాయకులు సుఖేందర్ గౌడ్, బోడ్ల రమేశ్​, దోనికెల్ నవీన్, నరేందర్ రెడ్డి, సదాశివ పాల్గొన్నారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్