3 నెలల్లో ప్రభుత్వంలోని పెద్దలు జైలుకు వెళ్లడం ఖాయం

3 నెలల్లో ప్రభుత్వంలోని పెద్దలు జైలుకు వెళ్లడం ఖాయం

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా నూతన కలెక్టరేట్ వరదల్లో మునిగిపోయిందని, ఇప్పుడు కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఈనెల 5వ తేదీన నిజామాబాద్ కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 3న తాము ఇందూరులో ‘జన్ కో జవాబ్ దో కేసీఆర్’ పేరుతో సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై లేఖలు రాసి ఇందూరులో ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయలేదో ఇందూరు ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల్లా ఎంపీ అయిన తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని మండిపడ్డారు. 

సీఎం కేసీఆర్ కు ప్రశ్నల వర్షం

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోపిడీ చేసిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. మూడు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి జిల్లా అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ లేదన్నారు. ఆర్మూర్ లో గుట్టలన్నీ మాయం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం కుటుంబ సభ్యులు అక్రమంగా ఇసుక దందా చేయడం సిగ్గుచేటన్నారు. కల్లుగీత కార్మికులు, యాదవులు, నాయి బ్రాహ్మణులు, రజక సోదరులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మోతేలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తానని చెప్పి..ఎందుకు  మాట తప్పారో చెప్పాలన్నారు. 

నిజాం షుగర్ ఫ్యాక్టరీ, లేదర్ పార్క్, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుల నిర్మాణాలు ఏమయ్యాయి..? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో జిల్లాకు అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నిజామాబాద్ కి వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికీ పోడు భూముల సమస్యలు అలాగే ఉన్నాయని, కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బీహార్ వెళ్లి తెలంగాణ పరువును తీశారంటూ సెటైర్ వేశారు.