
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎంపీ గొడం నగేశ్ సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్లతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ, జిల్లాస్థాయి దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల చదువు, ఆరోగ్యంపై స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జన్మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని, మిషన్ భగీరథ కింద ఆవాస గ్రామాలలో శుద్ధమైన తాగునీరు అందించాలని సూచించారు.
ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పోడు పట్టాదారుల భూముల్లో బోర్లు వేయాలని, బావులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణం, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో యూరియా కొరతలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీఎఫ్‌వో నీరజ్ కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీఆర్డీఏ దత్తరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్రానికి జీఓ 49తో సంబంధం లేదు
ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 49తో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నగేశ్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవో 49ను కేంద్రం తీసుకొచ్చిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలన్నారు. వెంటనే జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధోనీ శ్రీశైలం తదితరులు పాల్గొ న్నారు.