సాగునీటి వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నం : ఎంపీ కడియం కావ్య

సాగునీటి వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నం : ఎంపీ కడియం కావ్య
  • ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట, వెలుగు: సాగునీటి వనరులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి -ప్రణాళికలో భాగంగా ‘రైతు వారం’లో భాగంగా  వరంగల్  జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగుపై కొత్తగా నిర్మించిన చెక్ డ్యామ్‌‌‌‌‌‌‌‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆకేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్  దెబ్బతినడంతో పరివాహక ప్రాంత రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం రూ.46 లక్షలతో కొత్త చెక్ డ్యామ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించిందని, దీంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. 

భూగర్భ జలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బావులు, బోర్లలో నీటి సమస్య రాదన్నారు. చిన్న సాగునీటి వనరుల అభివృద్ధి ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించవచ్చన్నారు. చెక్ డ్యామ్‌‌‌‌‌‌‌‌లు, కాల్వలు, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మున్సిపల్  చైర్​పర్సన్  సారంగపాణి, వైస్  చైర్​పర్సన్  శోభారాణి, ఇరిగేషన్  ఎస్ఈ ప్రసాద్, ఈఈ కిరణ్ కుమార్, డీఈ రాజు, ఏఈ అమర్నాథ్, తహసీల్దార్​ విజయ్​సాగర్, ఎంపీడీవో వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ వెంకటయ్య, టెంపుల్  చైర్మన్  ప్రభాకర్  పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లలో గృహ ప్రవేశాలు..

వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించి గృహప్రవేశాలు చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేద , మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారమైందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తుమని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్  అయూబ్, ఏఎంసీ చైర్మన్  వెంకటయ్య పాల్గొన్నారు.