
న్యూఢిల్లీ, వెలుగు: ప్రతి చిన్న విషయానికి పార్టీ ఢిల్లీ పెద్దలపై ఆధారపడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని హస్తినలో తాకట్టు పెడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించరన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, అమలుకాని హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితిలో ఉన్న ఆ పార్టీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు.
మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎంతో అభివృద్ధి చేసిందని, దేశాన్ని పురోగతి దిశలో నడుపుతోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. 11 ఏండ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీజేపీ సర్కార్ విజయాలపై తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.