
- ఆస్తుల కోసం అన్న, చెల్లెలు కొట్లాడుకుంటున్రు
- ఎంపీ రఘునందన్రావు
పాపన్నపేట, వెలుగు : బంగారు తెలంగాణ పేరుతో ఇళ్లంతా బంగారం నింపుకొని, ఆస్తుల కోసం కుటుంబీకులే కొట్లాడుకుంటున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గురువారం మండల వరిధిలోని కొత్తవల్లిలో జరిగిన సేవా పక్షం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాయకుడు ప్రజల నమ్మకాన్ని కోల్పోతే, ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలే పునరావృతమవుతాయన్నారు. 75 వ వసంతంలోకి అడుగిడుతున్న భారత ప్రధాని నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడన్నారు.
మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు బీజేపీ తలపెట్టిన సేవా పక్షం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలువు నిచ్చారు. రక్తదానం, పారిశుధ్యం, స్వదేశీ వస్తువుల వినియోగంపై అవగాహన తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పాపన్నపేట మండలంలో సీసీ రోడ్లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేశామని, ఇతర సమస్యలు కూడా తీరుస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, జనరల్ సెక్రటరీలు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ,ఆకుల సుధాకర్, మండల శాఖ అధ్యక్షుడు సంతోష్ చారి పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి నష్టపోయిన ఆకుల శ్రీనివాస్ కుటుంబాన్ని ఎంపీ రఘునందన్ రావు గురువారం పరామర్శించారు. కుటుంబీకులకు అండగా ఉంటామన్నారు. గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి ఇన్సూరెన్స్ అందేలా చూడాలని మెదక్ కలెక్టర్ కు ఫోన్ ద్వారా సూచించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఇల్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మండలాధ్యక్షుడు రాకేశ్, సాయి, నరేశ్ఉన్నారు.