
మెదక్, వెలుగు: మెదక్ లో రైల్వే సేవల మెరుగుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావ్ చెప్పారు. బుధవారం ఆయన మెదక్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అమృత్ స్కీమ్ ద్వారా జరుగుతున్న స్టేషన్ ఆధునికీకరణ పనులు పరిశీలించారు. మెదక్ - మీర్జాపల్లి లింక్ రైల్వే లైన్ ప్రణాళికలకు సంబంధించి స్థానికులు, బీజేపీ నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. మెదక్ రైల్వే టెర్మినల్ అభివృద్ధి విషయమై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో ఫోన్ లో మాట్లాడారు.
ప్రస్తుతం మెదక్ కు నడుస్తున్న రెండు రైళ్ల వేళల మార్పులపై జీఎంతో చర్చించారు. మెదక్ నుంచి నిజామాబాద్, నాందేడ్, సికింద్రాబాద్, తిరుపతి వంటి ప్రధాన గమ్యస్థానాలకు రైళ్లు పెంచే అంశంపై ప్రజల విజ్ఞప్తులను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ వరకు స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు స్టేషన్ మాస్టర్ విజ్ఞప్తి చేయగా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ఎంపీ ఫండ్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, నాయకులు శ్రీనివాస్, సుభాష్ గౌడ్, ఎంఎల్ఎన్ రెడ్డి, ప్రసాద్ ఉన్నారు.
స్ఫూర్తి నింపేందుకే ప్రతిభా పురస్కారాలు
మెదక్ టౌన్: విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకే ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం మెదక్కలెక్టర్ఆఫీసులో కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్, ఆయా స్కూళ్ల టీచర్లు, పిల్లల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ..పది ఫలితాల్లో మెదక్ జిల్లా 12 స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. 550 మార్కుల పైన సాధించిన స్టూడెంట్స్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. వచ్చే సంవత్సరం కూడా వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, డీఎస్వో రాజిరెడ్డి, ఏఎమ్‌వో సుదర్శన్ మూర్తి, అధికారులు పాల్గొన్నారు.