ఆయనకు తెలిసింది ఎత్తిపోతలు కాదు.. ఎత్తుకుంట పోసుడే

ఆయనకు తెలిసింది ఎత్తిపోతలు కాదు.. ఎత్తుకుంట పోసుడే

జగిత్యాల: ప్రజల్ని మభ్య పెట్టడంలో కేసీఆర్ నిష్ణాతులని చెప్పారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో క‌ల‌సి నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ…కరోనా మీద కేసీఆర్ ఎన్ని సార్లు మాట మార్చారనే విషయంపై సర్వే చేస్తే 150 శాతం మెజార్టీ వస్తుందన్నారు. చెప్పిన అబద్దం మ‌ళ్లీ చెప్పకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడని అన్నారుజ. స్వయం నియంత్రణతో ప్రజలంతా క‌ల‌సి ప్రభుత్వానికి సహకరిస్తే .. రాత్రికి రాత్రి ఏమైందో , లిక్కర్ మాఫియా కేసీఆర్ తో ఏమాట్లాడిందో తెలియదు గానీ తెల్లారే సరికి వైన్ షాపుల‌న్ని తెరిచారని అన్నారు. లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ ప్ర‌జ‌లు నిష్టతో చేసిన ప్రయోజనం నిష్ప్రయోజనం అయ్యిందని, నీళ్లలో పోసినట్టు అయ్యిందని అన్నారు.

లాక్ డౌన్ తర్వాత వేగంగా కరోనా పెరిగిందని, దీంతో ప్రభుత్వం టెస్ట్ లు చెయ్యడమే మానేసిందన్నారు రేవంత్. గాంధీ ఆసుపత్రిలో 14 రోజుల తరవాత 354 మందిని పరీక్ష చెయ్యకుండానే సెల్ఫ్ కారైంటెన్ లో ఉండాలని ఇంటికి పంపారన్నారు. కరోనా పాజిటివ్ తో మ‌‌రణిస్తే కరోనాతో చనిపోయారని నివేదిక కూడా ఇవ్వడం లేదన్నారు. ప‌క్క రాష్ట్రాల కరోనా టెస్ట్ లు లక్షల్లో చేస్తే , తెలంగాణ లో వాటిని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారన్నారు. చెత్తగా కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో ఉందని విమ‌ర్శించారు. త‌న వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే కేసీఆర్ పోతి రెడ్డి పాడు అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు.

పెట్టుబడి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను తుక్కు కింద అమ్మే ప్రయత్నం చేసి, కొత్త వాటిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ లను ఖతం చెయ్యడానికి కంకణం కట్టుకున్నార‌ని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఉన్న‌ది ధైర్యం కాద‌ని బరితెగింపు అని అన్నారు. జ‌నాలు సినిమాలు చూసి బోర్ కొట్టి తమాషా కోసం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తున్నారన్నారు . ప్రజా ప్రయోజనం ఆ ప్రెస్ మీట్ లో లేదని అన్నారు.

కరోనా వల్ల రాష్ట్రానికి నష్టం జ‌రిగితే.. కేసీఆర్ కు మాత్రం లాభం జరిగిందన్నారు రేవంత్. కేసీఆర్ ఈ విప‌త్తును అనుకూలంగా మార్చుకొని కాంట్రాక్ట్ ల నుంచి కమిషన్ల వరకు చక్క దిద్దుకున్నార‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 3 వేల కోట్లు జీతాలు కట్ చేశారన్నారు. 8 వేల కోట్లు అదనపు ఆదాయం 60 రోజుల్లో వచ్చిందన్నారు. దాతల పైసలు , జీతాల్లో కోతల డబ్బులు ఎక్కడ పోయాయి? అని ప్ర‌శ్నించారు.

జర్నలిస్ట్ లలో నిరుపేదలు ఉన్నారని, వారు ఉద్యమంలో కూడా ప‌ని చేశార‌న్నారు. అలాంటి వారికి రూ. 10 వేలు ఉదారంగా ఇవ్వాల‌ని సీఎం ను డిమాండ్ చేశారు . గడ్డి పోచతో సమానమని మీరు విసిరిన పదవులు 3 నెలల్లో మీకే వచ్చినాయి కానీ 1200 బిడ్డల ప్రాణాలు తిరిగి వచ్చాయా..? అని అడిగారు రేవంత్ రెడ్డి. ఓడిపోతే బిడ్డకు పదవి ఇచ్చిన కేసీఆర్, శంకరమ్మ కు పదవి ఇచ్చిండా? అని ప్ర‌శ్నించారు.కేసీఆర్ కు నోరు నొప్పి పుట్టి తిట్టని తిట్లు తిడుతున్నాడ‌ని అన్నారు. ఆయనకు నీళ్ళ గురించి కంటే , మందు సీసాలు గురించే ఎక్కువ తెలుసని అన్నారు. ఆయనకు తెలిసింది ఎత్తి పోతలు కాదు ..ఎత్తుకుంట పోసుడే అని విమ‌ర్శించారు రేవంత్ .