రిమ్స్​లో అందని ఎమ్ఆర్​ఐ సేవలు.. అమలుకాని మంత్రి హరీశ్​ రావు హమీ 

రిమ్స్​లో అందని ఎమ్ఆర్​ఐ సేవలు.. అమలుకాని మంత్రి హరీశ్​ రావు హమీ 
  •     మెషీన్​​ ఏర్పాటు చేయకుండానే సేవలు ప్రారంభం 
  •      స్కానింగ్​ కోసం మహారాష్ట్ర, హైదరాబాద్ పోతున్న రోగులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఎంఆర్​ఐ సేవలు అందడం లేదు. మంత్రి హరీశ్​ రావు గతేడాది మార్చ్​లో  ఎంఆర్​ఐ సేవలను ప్రారంభించారు. కానీ, డాక్టర్లను, మెషీన్​ను మాత్రం కేటాయించలేదు.  దీంతో రోగులకు అవసరమయ్యే సేవల్లో ముఖ్యమైన ఎంఆర్​ఐ స్కానింగ్​ అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఉత్తర్వులిచ్చి ఏడాది..

 రూ. 150 కోట్లతో హాస్పిటల్​ను నిర్మించారు. హాస్పిటల్ ప్రారంభించిన సమయంలో రిమ్స్ కు విలువైన ఎమ్మారై స్కానింగ్ మెషీన్​ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రజలకు అత్యాధునిక పరీక్షలు చేసే మెషీన్​ అందుబాటులోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏడాది గడుస్తున్నా ఎమ్మారై మెషీన్​ రాలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 హైదరాబాద్, మహారాష్ట్రకు రిఫర్..

రిమ్స్ హాస్పిటల్లో ఎమ్మారై మెషీన్​ లేకపోవడంతో స్కానింగ్ టెస్టుల కోసం రోగులు హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్తున్నారు. మెదడు, వెన్నుముక, ఛాతి, కీళ్లనొప్పులు వంటి సమస్యలను ఎమ్మారై స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చు. సీటీ స్కానింగ్ లో సైతం కనిపించని సమస్యను ఎమ్మారై ద్వారా తెలుసుకొనే వీలుంది. ఈ తరహా టెస్ట్ చేయించుకునే పరిస్థితులు ఇక్కడ లేకపోవడంతో రోగులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రోజూ 30 టెస్టులు..

ఆస్పత్రికి వస్తున్న వారిలో రోజూ దాదాపు 30 మంది కి ఎంఆర్​ఐ స్కానింగ్​ అవసరం అవుతున్నట్టు తెలుస్తోంది. వీరిని హైదరాబాద్​లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ కు రిఫర్ చేస్తున్నారు. మరికొంత మంది మహారాష్ట్ర వెళ్తున్నారు. ప్రైవేట్ లో ఎమ్మారై స్కానింగ్ కోసం దాదాపు రూ. 15 వేల దాకా ఖర్చవుతోంది. ఇక రాకపోకలు, ఇతర వైద్య ఖర్చులకు దాదాపు ఒక పేషంట్ బయటకు వెళ్లితే రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు భారం పడుతోంది. అదే రిమ్స్ లో నే ఎమ్మారై ఉంటే ఖర్చుల భారం తగ్గే వీలుంది. మెషీన్​ కోసం గతంలో ప్రతిపక్షాలు నిరసనలు చేసినా ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు. 

స్కానింగ్ కు రూ. 11 వేలు తీసుకున్నరు

20 రోజుల క్రితం మా అమ్మ తలకు దెబ్బతాకితే రిమ్స్ కు తీసుకొచ్చాం. ఇక్కడ సీటీ స్కానింగ్ తీశారు. కానీ అందులో ఎలాంటి సమస్యా బయటపడలేదు. మహారాష్ట్రలోని యవత్ మాల్ తీసుకెళ్లారు. అక్కడ ఎంఆర్​ఐ స్కానింగ్ చేసి, రూ. 11 వేలు తీసుకున్నారు. నరం దెబ్బతిన్నట్లు చెప్పారు. మొత్తం ట్రీట్ మెంట్ చేయించుకున్నాం. దాదాపు రూ. 45 వేలు ఖర్చుయింది. రిమ్స్​లో ఎంఆర్​ఐ లేకపోవడంతోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. –విపిన్ టాక్రే, మనియర్ పూర్ గ్రామం

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

ఎంఆర్​ఐ మిషన్ ఏడాది క్రితమే మంజూరైంది. మెషీన్​ తెప్పించుకునేందుకు ఆలస్యమవుతోంది. ఇప్పటికే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం జరుగనుంది. మెషీన్​ గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలో వచ్చేలా చూస్తాం.  -జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్