MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన జట్టు వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఘోర ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తో జరిగిన హైవోల్టేజ్ పోరులో చెన్నై ఘోరంగా ఓడిపోయింది. మైదానంలో మహేంద్ర సింగ్ ధోనీ మార్గనిర్దేశం లేకపోవడం, వికెట్ల వెనుక అతడి చాకచక్యం లోపించడంతో జట్టు ప్రదర్శనపై తీవ్రంగా కనిపిస్తుంది. పిక్క కండరాల గాయంతో మొదటి రెండు వారాలు ధోనీ అందుబాటులో ఉండరని సీఎస్కే ఫ్రాంచైజీ ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అతడి రాకను త్వరలోనే ఫిక్స్ చేసే అవకాశం ఉంది.
తలా రీఎంట్రీ:
నిజానికి మహేంద్ర సింగ్ ధోనీ ఐదో మ్యాచ్‌లో కోల్‌కతాపై పునరాగమనం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ జట్టు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండటంతో, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనే ఎంఎస్ ధోనీ బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ పరీక్షలో ధోనీ నెగ్గితే, సొంత మైదానంలో అభిమానుల కేరింతల మధ్య మహేంద్రుడు మెరుపులు మెరిపించడం ఖాయంగా మారనుంది.
ఫినిషర్‌గా ధోనీ:
వయసు మీద పడుతున్నప్పటికీ, ఎంఎస్ ధోనీ ఫినిషింగ్ సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదు.. వికెట్ కీపింగ్‌లో మెరుపు వేగంతో స్పందించడమే కాకుండా, క్లిష్ట సమయాల్లో బౌలర్లకు సరైన సలహాలు ఇవ్వడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ధోనీ అనుభవం చెన్నై జట్టుకు ఎంతో అవసరం అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరవాలని సీఎస్కే పట్టుదలతో ఉంది. ఈ కీలక పోరులో ధోనీతో పాటు మరో ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ సైతం తుది జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని.. వీరిద్దరి రాకతో జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
