వెబ్ సిరీస్ లో ఆ స్వేచ్ఛ ఉంది: మంచు లక్ష్మి

వెబ్ సిరీస్ లో ఆ స్వేచ్ఛ ఉంది: మంచు లక్ష్మి

‘ఏడాదంతా కష్టపడి సినిమా చేస్తే అది ప్రేక్షకులకు చేరువ కాలేకపోతోంది. విడుదల సమస్యల వల్ల సినిమా తీయాలంటేనే భయమేస్తోంది. ఓ ఐదుగురి చేతుల్లోనే థియేటర్స్ ఉండటం, సరైన థియేటర్స్ లభించకపోవడం, ఒకవేళ లభించినా మరో సినిమా వస్తోందని వారానికే తీసేయడం జరుగుతోంది’ అన్నారు మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ వెబ్ సిరీస్ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా పై విధంగా స్పందించారు. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌‌ని మంచు టెలిఫిల్మ్స్‌తో కలసి యుప్ టీవీ స్టూడియోస్ నిర్మించింది. ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథను అందించారు. మధ్య తరగతి గృహిణి పాత్రలో మంచు లక్ష్మి నటించగా, ఆమె భర్తగా అవసరాల శ్రీనివాస్ నటించారు. చిత్రం శ్రీను, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్ ఇతర పాత్రలు పోషించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న జీ–5 యాప్ ద్వారా ఈ వెబ్ సిరీస్‌‌ విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘కథ నచ్చింది, హిలేరియస్‌‌గా అనిపించింది.

సినిమాగా అనుకున్న కథను వెబ్ సిరీస్‌‌గా మలచిన క్రెడిట్ దర్శకుడిదే. తొలిసారి వెబ్ సిరీస్‌‌లో నటించడం ఆనందంగా ఉంది. కంటెంట్ విషయంలో ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ. లేడీ ఓరియెంటెడ్ కథలా అనిపించినా మగవారు ఎక్కువ కనెక్ట్ అవుతారు. అవసరాల శ్రీనివాస్‌‌కి పెద్ద అభిమానిని. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇతర చిత్రాలతో బిజీగా ఉండి కూడా ఈ వెబ్ సిరీస్‌‌కి సమయం కేటాయించారు. ఇప్పటికే నేను చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఇందులో ఫన్ క్యారెక్టర్ చేశాను. ఇకపై కూడా ఇలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను. దీనికి సీక్వెల్ కూడా చేయబోతున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది’ అన్నారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ ‘సుబ్బలక్ష్మి పాత్రలో మంచు లక్ష్మి సహజంగా నటించారు. టెక్నికల్‌‌గా నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. గత సంవత్సరమే పూర్తయింది. ఇందులో భాగమవడం గర్వంగా ఉంది’ అని చెప్పారు. ఒక్కరోజు మహిళ ఇంట్లో లేకపోతే ఏం జరుగుతుంది అనే అంశాన్ని వినోదభరితంగా చెప్పామని, మంచు లక్ష్మిని దృష్టిలో ఉంచుకునే ఈ కథ రాశానని రచయిత్రి రమణి చెప్పారు. చిత్రం శ్రీను మాట్లాడుతూ ‘ఇంతవరకూ ఏ చిత్రంలోనూ చేయని పాత్ర ఇందులో పోషించాను. లక్ష్మిగారితో నటించడం ఇదే మొదటిసారి. మా అందరికంటే ముందే ఆవిడ సెట్‌ కి వచ్చేవారు’ అన్నారు. జీ –5 హెడ్ నిమ్మకాయల ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ భాస్కర్, సంగీత దర్శకుడు ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.