బీఆర్ఎస్ కు ముదిరాజ్ లీడర్ .. పులిమామిడి గుడ్ బై

బీఆర్ఎస్ కు ముదిరాజ్  లీడర్ ..  పులిమామిడి గుడ్ బై

బీఆర్ఎస్ కు ముదిరాజ్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు రాజీనామా చేశారు. ఈనెల 11న బీజేపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కొంతకాలంగా బీఆర్ఎస్  టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయినా తనకు టికెట్  రాలేదని వాపోయారు. ఈనెల 11న సంగారెడ్డి స్టేడియం గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరబోతున్నానని తెలిపారు. 

ఆరోజు జరిగే బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్  తదితరులు హాజరవుతారని, వారి సమక్షంలో బీజేపీలో చేరుతానని రాజు చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తమకు ఎక్కడా టికెట్లు ఇవ్వని సీఎం కేసీఆర్.. కనీసం సంగారెడ్డి నియోజకవర్గంలో అయినా తమకు అవకాశం ఇవ్వాలని ముదిరాజ్ లు డిమాండ్  చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ముదిరాజ్ కులస్తుల సూచనలు, సలహా మేరకు పులిమామిడి రాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం

బీఆర్ఎస్  నేత పులిమామిడి రాజు రాజీనామా చేయడంతో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడనుంది. నియోజకవర్గంలో ముదిరాజ్  కులస్తుల ఓటు బ్యాంకు సుమారు 40 శాతం ఉంది. పైగా ముదిరాజ్  సంఘం తరఫున రాజు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో  సంఘం పెద్దలు, కుల ఓటర్లు ఆయన అభ్యర్థిత్వానికే మద్దతు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు ముందే ముదిరాజ్ సంఘం తరఫున సంగారెడ్డి నుంచి రాజు పేరు ప్రతిపాదించారు. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదు. తాజాగా పులిమామిడి రాజీనామాతో బీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.