అంబానీ సంపద రూ.83,248 కోట్లు

అంబానీ సంపద రూ.83,248 కోట్లు

రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీ 2023లో రూ.83,248 కోట్ల సంపాదనతో ఫస్ట్​ ప్లేస్​లో నిలిచారు. రూ.78 వేల కోట్ల సంపాదనతో హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రెండవ స్థానంలో ఉన్నారు.

ప్రస్తుత క్యాలెండర్​ సంవత్సరంలో రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీ అత్యధికంగా రూ.83,248 కోట్ల సంపాదనతో నంబర్​వన్​ స్థానంలో నిలిచారు. ఓపీ జిందాల్ గ్రూప్ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్ సావిత్రి జిందాల్ మొత్తం నికర విలువ 24.7 బిలియన్ డాలర్ల సంపాదనతో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆమె తన సంపదను జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్  జిందాల్ ఎనర్జీ వంటి గ్రూప్ కంపెనీల నుంచి పొందారు. తాజాగా ఆమె సంపాదన 8.93 బిలియన్ డాలర్లు పెరిగింది.

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్‌‌ అంబానీకి 2023 సంవత్సరం కలిసి వచ్చింది. ఈ 12 నెలల్లో ఆయన 9.98 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.83,248 కోట్లు)  సంపాదించారు. దీంతో ఆయన మొత్తం సంపాదన 97.1 బిలియన్ డాలర్లకు చేరింది. అంబానీ భారత్​లోనే అత్యంత సంపన్నుడే కాదు...  ప్రపంచవ్యాప్తంగా 13వ సంపన్న వ్యక్తి కూడా. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్,  జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి భారీ ఆదాయం రావడం, ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్ స్టాక్‌‌‌‌‌‌‌‌ 9 శాతం పెరగడం, విభజన తర్వాత జియో ఫైనాన్షియల్ స్టాక్ లిస్టింగ్ కారణంగా ఇంత డబ్బు వచ్చింది. హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రెండవ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆయన  సంపద 9.47 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.78 వేల కోట్లు) పెరిగి 34 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

 ఐటీ రంగానికి ఈ సంవత్సరం బాగా లేనప్పటికీ హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్ షేర్లు 41 శాతం పెరిగాయి. ఓపీ  జిందాల్ గ్రూప్ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ సావిత్రి జిందాల్ 8.93 బిలియన్ డాలర్లు సంపాదించి మూడవ స్థానంలో నిలిచారు. ఆమె తన సంపదను జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ ఎనర్జీ వంటి గ్రూప్ కంపెనీల నుంచి పొందారు. దీంతో   మొత్తం సంపాదన 24.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరో విశేషం ఏంటంటే సావిత్రి అత్యంత ధనిక భారతీయ మహిళగానూ రికార్డులకు ఎక్కారు.  డీఎల్​ఎఫ్ చైర్మన్​ కుశాల్ పాల్ సింగ్​కు కూడా ఈ ఏడాది కనకవర్షం కురిసింది. డీఎల్​ఎఫ్​ షేర్ ధరలో 91 శాతం పెరుగుదల కారణంగా సంపద 7.83 బిలియన్ డాలర్లు పెరిగింది.  ప్రస్తుతం సింగ్ నికర విలువ 16.1 బిలియన్ డాలర్లు.

నాలుగో స్థానంలో షాపూర్ ​మిస్త్రీ

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను నియంత్రిస్తున్న షాపూర్ మిస్త్రీ ఈ ఏడాది తన సంపదకు 7.41 బిలియన్ డాలర్లు జోడించారు. ఆయన నికర విలువ ఇప్పుడు 35.2 బిలియన్ డాలర్లు. 2023లో తమ నికర విలువను బాగా పెంచుకున్న ఇతర బిలియనీర్లలో ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా (7.09 బిలియన్ డాలర్లు), రవి జైపురియా (5.91 బిలియన్ డాలర్లు), సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి (5.26 బిలియన్ డాలర్లు), లోధా గ్రూప్ మంగళ్ ప్రభాత్ లోధా  (3.91 బిలియన్ డాలర్లు),  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నుంచి సునీల్ మిట్టల్ (3.62 బిలియన్) ఉన్నారు.  ప్రస్తుతం రెండవ అత్యంత సంపన్న భారతీయుడైన గౌతమ్ అదానీ 2023లో విపరీతంగా డబ్బులు పోగొట్టుకున్నారు. అనేక కంపెనీలలోని షేర్లను భారీగా విక్రయించడం వల్ల 37.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. 

అదానీ మొత్తం నికర విలువ ఇప్పుడు 83.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. సంవత్సరం ప్రారంభంలో నష్టపోయిన అనేక అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇంకా కోలుకోలేదు. వాటిలో అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ (2023లో 26 శాతం తగ్గుదల), అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (59 శాతం తగ్గుదల), అదానీ గ్రీన్ ఎనర్జీ (15 శాతం తగ్గుదల), అదానీ టోటల్ గ్యాస్ (72 శాతం తగ్గుదల), అదానీ విల్మార్ (41 శాతం తగ్గుదల), ఏసీసీ ( 9 శాతం), అంబుజా సిమెంట్స్ (1 శాతం)  ఎన్​డీటీవీ (23 శాతం) ఉన్నాయి. రిటైల్ చైన్ డి-మార్ట్‌‌‌‌‌‌‌‌ను నడుపుతున్న రాధాకిషన్ దమానీ, 187 మిలియన్ డాలర్లను కోల్పోయారు. కంపెనీ షేర్లు 2023లో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి.