
భారత స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఇన్వెస్టర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీవో గురించి ముఖేష్ అంబానీ ఏజీఎంలో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ అంబానీ 2026 మెుదటి అర్థభాగంలో రిలయన్స్ జియో ఐపీవో ఉంటుందని చెప్పారు. ఈ ఐపీవో భారత టెలికాం కంపెనీలో అత్యంత పెద్దదిగా ఉంటుందని స్పష్టం చేశారు అంబానీ.
ప్రస్తుతం జియో యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటిందని చెప్పారు అంబానీ. జియో 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో జియో ఫ్యామిలీ ఇంతపెద్దదిగా మారటంపై గర్వంగా ఉందని చెప్పారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న కంపెనీ ఐపీవో భారత రిటైల్, డిజిటల్ మార్కెట్లలో మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాబోతున్న జియో ఐపీవో దేశీయ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ పెట్టుబడిదారులకు ఒక ఆకర్షణీయమైన అవకాశంగా ఉండనుందని చెప్పారు అంబానీ.
రిలయన్స్ జియో ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరించడానికి సిద్ధంగా ఉందని, అడ్వాన్స్డ్ 5G సేవల, AI ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికల్లో ఉన్నట్లు ముఖేష్ చెప్పారు. అంబానీ ఆసక్తికరంగా చెప్పిన విషయాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10% శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని ఏజీఎంలో అనటమే. రిలయన్స్ కొత్త సాంకేతికతలతో, గ్రీన్ ఎనర్జీ, బయో సైన్స్, AI రంగంలో పెట్టుబడులతో దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రణాళికలు చేసుకుంటోందని రిలయన్స్ అధినేత చెప్పారు.