100 బిలియన్​ డాలర్ల క్లబ్‌లోకి అంబానీ

100 బిలియన్​ డాలర్ల క్లబ్‌లోకి  అంబానీ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా 100 బిలియన్ డాలర్ల క్లబ్‌‌లోకి ఎంటర్ అయ్యారు. గత కొన్ని సెషన్ల నుంచి రిలయన్స్ షేర్లు దూసుకుపోతుండంతో అంబానీ సంపద అమాంతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 మంది సంపద మాత్రమే 100 బిలియన్ డాలర్లను దాటింది. తాజాగా ఈ క్లబ్‌‌లోకి ముకేశ్ అంబానీ కూడా యాడ్ అయ్యారు. ఆయన సంపద 100.6 బిలియన్ డాలర్లుగా(రూ. 7.5 లక్షల కోట్లు) ఉందని బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలియనీర్స్‌‌ ఇండెక్స్ పేర్కొంది. ఈ ఏడాది అంబానీ సంప ద 23.8 బిలియన్ డాలర్లు పెరిగింది. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌‌లో  జెఫ్‌‌బెజోస్‌‌, ఎలన్ మస్క్‌‌, బెర్నార్డ్‌‌ ఆర్నాల్ట్‌‌ వంటి మహా మహా ధనవంతులు ఉన్నారు. 

కొత్త వ్యూహాలతో ముందుకు..

రిలయన్స్ ఆయిల్‌‌ బిజినెస్‌‌ను 2005 లో ముకేశ్ అంబానీ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కొత్త  స్ట్రాటజీలతో అంబానీ దూసుకుపోయారు. కేవలం ఆయిల్ బిజినెస్‌‌పైనే కాకుండా రిలయన్స్‌‌ను టెలికం, రిటైల్‌‌ బిజినెస్‌‌లలో కూడా లీడర్‌‌‌‌గా మార్చారు. రిలయన్స్ జియోని 2016 లో అంబానీ స్టార్ట్‌‌ చేశారు.  ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలోనే అతిపెద్ద టెలికం నెట్‌‌వర్క్‌‌గా ఎదిగింది. జియోలో ఫేస్‌‌బుక్‌‌, గూగుల్‌‌ వంటి పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్‌‌ చేయడం గమనించాలి. కానీ, ఇప్పటికీ రిలయన్స్ యాన్యువల్ రెవెన్యూ 73 బిలియన్ డాలర్లలో 60 శాతం వాటా ఆయిల్ బిజినెస్‌‌దే ఉంది. ఈ బిజినెస్‌‌లో సుమారు 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడానికి సౌదీ ఆరామ్‌‌కో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదు.

ముందుంది గ్రీన్ ఎనర్జీ..

ముకేశ్ అంబానీ చూపు ఇప్పుడు గ్రీన్ ఎనర్జీపై పడింది. ఈ బిజినెస్‌‌లో దూసుకుపోవడానికి ఏకంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. సోలార్ మాడ్యుల్స్‌‌, సెల్స్‌‌, హైడ్రోజన్ తయారీ వంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రతీదాన్ని ఆయన తయారు చేయాలని చూస్తున్నారు.  నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా  గ్రీన్‌‌ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ముకేశ్ అంబానీ ప్లాన్స్ వేయడమే కాదు, వాటిని అమలు చేయడంలో సిద్ధహస్తుడని ఎనలిస్టులు అంటున్నారు. ఆయన గ్రీన్ ఎనర్జీలో ఎలా ముందుకెళతారో చూడాలి. అదానీ గ్రూప్ ఫౌండర్‌‌ గౌతమ్ అదానీ సంపద  కూడా ఈ ఏడాది 39.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన సంపద 74.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. విప్రో ఫౌండర్ అజిమ్ ప్రేమ్‌జీ కూడా తన సంపదను ఈ ఏడాది 12.8 బిలియన్‌ డాలర్లు పెంచుకోగలిగారు.