
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2025కి సంబంధించిన ఫోర్బ్స్ ‘ఇండియాస్ 100 రిచెస్ట్’ లిస్ట్‌లో మళ్లీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. గతంలో సన్ ఫార్మా దిలిప్ సంఘ్వీ, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ టాప్ ప్లేస్‌లో కొంత కాలం కొనసాగారు. అంబానీ సంపద 105 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ పనితీరు బలహీనంగా ఉండటంతో, దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 9శాతం తగ్గి ఒక ట్రిలియన్ డాలర్లకు పడింది. గౌతమ్ అదానీ కుటుంబం 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.
సునీల్ మిట్టల్ సంపద ఈ ఏడాది ఎక్కువగా పెరిగింది. ఎయిర్‌టెల్ షేర్లు పెరగడంతో ఆయన సంపద 3.5 బిలియన్ డాలర్లు పెరిగి 34.2 బిలియన్ డాలర్లకు ఎగిసింది. దీంతో రిచ్‌లిస్ట్‌లో ఆయన నాలుగో స్థానానికి చేరారు. హెచ్‌సీఎల్ శివ్ నాడార్ ఐదో స్థానానికి జారిపోయారు. వారీ ఎనర్జీస్ దోషి సోదరులు (7.5 బిలియన్ డాలర్లు), డిక్సన్ టెక్ సునీల్ వాచాని (3.85 బిలియన్ డాలర్లు) లాంటి కొత్తవారు ఈ జాబితాలోకి వచ్చారు. ఫోర్బ్స్ రిచ్‌లిస్ట్‌లో చేరడానికి కట్-ఆఫ్ ఈసారి 3.2 బిలియన్ డాలర్లు.