
న్యూఢిల్లీ: శక్తిమాన్ టీవీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఈ షో ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ఇండియన్ సూపర్ హీరోను ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ షోతో నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముఖేశ్ ఖన్నా చాలా పాపులారిటీ సంపాదించారు. తాజాగా శక్తిమాన్‌కు సంబంధించి ముఖేశ్ హాట్ అప్‌డేట్ ఇచ్చారు. త్వరలో శక్తిమాన్ సిరీస్‌ను ట్రయాలజీగా పట్టాలెక్కించనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇండియన్ సూపర్ హీరో సినిమాలైన క్రిష్, రా.వన్‌ను మించే స్థాయిలో శక్తిమాన్ సిరీస్‌ను తెరకెక్కించనున్నట్లు చెప్పారు. ‘శక్తిమాన్ మిత్రులారా మీ సూపర్ హీరో మళ్లీ వస్తున్నాడు. త్వరలో శక్తిమాన్-2ను తీసుకొస్తున్నాం. అది కూడా టెలివిజన్ చానల్‌పైనో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీదో కాదు. మూడు భాగాలుగా పెద్ద తెరపై విడుదల చేయనున్నాం. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం పెద్ద నిర్మాణ సంస్థతో చేతులు కలిపాం’ అని తన ఇన్‌స్టాలో ముఖేశ్ పోస్ట్ చేశారు.