రాజ్యసభ డిప్యూటీగా ముక్తార్ అబ్బాస్ నఖ్వి

రాజ్యసభ డిప్యూటీగా ముక్తార్ అబ్బాస్ నఖ్వి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా నియమితులయ్యారు. ఇంత వరకు డిప్యూటీ లీడర్ గా ఉన్న పీయూష్ గోయల్ రాజ్యసభ లీడర్ గా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో డిప్యూటీ లీడర్ గా ముక్తార్ అబ్బాస్ నఖ్విని నియమించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వికి పార్లమెంటరీ వ్యవహారాల్లో గతంలో పనిచేసిన విశేషానుభావం ఉండడంతో డిప్యూటీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
మోడీ తొలిసారి ప్రధానిగా ఎంపికైన సమయంలో ఈయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఈయన పనితీరును గుర్తించిన ప్రధాని మోడీ ఈసారి అవకాశం వచ్చిన వెంటనే డిప్యూటీగా ఏ మాత్రం ఆలోచించకుండా ముక్తార్ అబ్బాస్ నఖ్వికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో సంఖ్యాబలం గట్టిగా ఉండడంతో ప్రతిపక్షాలను నిలువరించేందుకు ముక్తార్ అబ్బాస్ నఖ్వికే సాధ్యమని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్.. పెట్రో ధరల పెంపు.. రైతుల ఆందోళనల వంటి పరిణామాల నేపధ్యంలో ప్రతిపక్షాలను నిలువరించడం ఒకరకంగా సవాల్ గా మారింది. ఈ నేపధ్యంలో కీలకమైన బాధ్యతలు నఖ్వికి ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.