
- పందుల స్వైర విహారం
- దుర్వాసనలోనే విద్యాబోధన
- పట్టించుకోని అధికారులు
లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడ ప్రైమరీ స్కూల్ఆవరణ కంపుకొడుతోంది. స్కూల్ ఆవరణలో నీరు నిలిచి మొత్తం బురదమయంగా మారింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దుర్వాసన మధ్యనే విద్యార్థులు ఇబ్బందులను పడుతూ గడుపతున్నారు. స్కూల్లో 102 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు గదుల్లోనే ఐదు తరగతుల స్టూడెంట్లకు బోధన చేస్తున్నారు. కిచెన్ షెడ్‌ను కూడా తరగతి గదిగా ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు స్కూల్ ప్రహరీ కూలిపోవడంతో పాఠశాల ప్రక్కనే ఉన్న బొట్లకుంట నీరు స్కూల్ ఆవరణలోకి చేరుతుండడంతో మొత్తం బురదమమైంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
దుర్గంధం మధ్య విద్యాబోధన
పాఠశాల ఆవరణ మొత్తం బురదమయం కావడంతో పందులు తిరుగుతున్నాయి. పాఠశాల ఆవరణ మొత్తం దుర్గంధం వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బోధన కొనసాగిస్తున్నాం. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలి.- దిలీప్ కుమార్, స్కూల్ హెచ్ఎం