నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నరు : సీతక్క

నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నరు : సీతక్క

కొత్తగూడ, వెలుగు : తనను ఓడించేందుకు బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు, మంత్రులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడ, గంగారంలో శనివారం ఆమె పర్యటించారు. అనంతరం కొత్తగూడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాలకు సీడీఎఫ్‌‌ నిధులు ఇచ్చి, ములుగుకు ఇవ్వకపోవడం వల్లే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. పదేళ్ల నుంచి అభి-వృద్ధిని పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రకటనలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.

కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి, ఏజెనీలో గిరిజనేతరులకు అండగా ఉంటామని, ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. అనంతరం గంగారంలో కొత్తగా నిర్మించిన లైబ్రరీని ప్రారంభించారు. బావురుగొండలో ఇటీవల చనిపోయిన ఏఎస్‌‌ఐ పిడిగె శోభన్‌‌బాబు ఫ్యామిలీని పరామర్శించారు. అనంతరం పలువురు కాంగ్రెస్‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఆమె వెంట ఎంపీపీ విజయారూప్‌‌సింగ్‌‌, జడ్పీటీసీలు పుష్పలత, రమ, మండల  అధ్యక్షుడు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, లీడర్లు నారాయణరెడ్డి, మొగిలి, బిట్ల శ్రీనివాస్‌‌ పాల్గొన్నారు.